Cyclone Mandous: మాండౌస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మైపాడు తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 50 మీటర్లకు పైగా ముందుకురావడంతో.. అలలు బీచ్ వద్ద దుకాణాలను తాకుతున్నాయి. పెన్నా పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.
తుపాను ప్రభావంతో రైతుల్లో ఆందోళన:తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్న షల్టర్‌లలో వసతులు ఏర్పాటు చేశారు. జిల్లాకు ఒక ఎస్డీఆర్ఎఫ్, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా సోమశిల జలాశయం నుంచి.. పెన్నా నదిలోకి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తీర ప్రాంతంలోని 11మండలాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో అల్లూరి జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాల కారణంగా ధాన్యం పాడవుతుందని రైతులు దిగులు చెందుతున్నారు.