నకిలీ విత్తనాల విక్రేతలపై పోలీసుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ శాఖాధికారుల సాయం తీసుకొని నిషేధిత విత్తనాల బండారాన్ని ఇట్టే బయట పెట్టేస్తున్నారు. సాధారణంగా విత్తన కంపెనీలు... ఆర్గనైజర్ల సాయంతో ఎంపిక చేసిన రైతుల వద్ద విత్తనాల సాగు చేయిస్తాయి. విత్తనాలు చేతికొచ్చిన తర్వాత రైతులు ఆర్గనైజర్ల సాయంతో కంపెనీలకు విక్రయిస్తారు. కంపెనీలు విత్తనాలకు పలు పరీక్షలు నిర్వహిస్తాయి. వ్యవసాయ శాఖాధికారుల పర్యవేక్షణలో జర్మినేషన్ ప్రక్రియను కూడా నిర్వహిస్తాయి. జర్మినేషన్ ఫలితాలు బాగున్న విత్తనాలను మాత్రమే కంపెనీలు స్వీకరిస్తాయి. నిర్ధేశించిన విధంగా జర్మినేషన్ రాకపోతే కంపెనీలు ఆ విత్తనాలను తిరస్కరించి.. తిరిగి ఆర్గనైజర్లకు ఇచ్చేస్తాయి. ఇక్కడే ఆర్గనైజర్లు వక్రబుద్ధి చూపిస్తారు. కంపెనీలు తిరస్కరించిన విత్తనాలు రైతులు తీసుకొని వాటిని పడేయాల్సి ఉంటుంది. కానీ ఆర్గనైజర్లు రైతుల నుంచి ఆ విత్తనాలను అతి తక్కువ ధరకు కొని వాటిని నకిలీ విత్తనాల వ్యాపారులకు విక్రయిస్తారు. కంపెనీలు తిరస్కరించిన విత్తనాలను నకిలీ విత్తనాల వ్యాపారులు రంగు రంగుల ప్యాకెట్లలో నింపి మార్కెట్లలోకి సరఫరా చేస్తున్నారు. వీటి గురించి తెలియని ఈ విత్తనాలు కొని సరైన దిగుబడి లేక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖాధికారులు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను సీజ్ చేస్తున్నారు.
బీజీ-3 రకం విత్తనాలు సరఫరా..
పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం బీజీ-3 రకం విత్తనాలను నిషేధించింది. అయితే విత్తనాల వ్యాపారులు మాత్రం ఈ రకం విత్తనాలను కూడా మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలు విక్రయించే విత్తనాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా ప్యాకెట్లపై పొందుపరుస్తారు. విత్తనాలను పరీక్షించిన తేదీ, కంపెనీ పేరు, నాణ్యత, విత్తన రకానికి సంబంధించిన వివరాలన్నీ ప్యాకెట్లపై ఉంటాయి. కానీ సాధారణ విత్తన వ్యాపారులు లాభాపేక్షే ధ్యేయంగా ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను సైతం విక్రయిస్తున్నారు. బీజీ-3 రకం విత్తనాలను ఆకర్షణీయమైన ప్యాకెట్లలో నింపుతున్నారు. కానీ బీజీ-3 రకం అని ఎక్కడా పొందుపర్చకుండా ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఈ పత్తి విత్తనాలను వాడితే ఎలాంటి కలుపు మొక్కల బాధ ఉండదని రైతులను ఒప్పించి విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారులు ఇలాంటి విత్తనాలను గుర్తించడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీజీ-3 రకం పత్తి విత్తనాలు అని అనుమానం రాగానే వెంటనే ఆ ప్యాకెట్ లో నుంచి పత్తి విత్తనాలను తీసుకుంటున్నారు. పత్తి విత్తనాన్ని పొడి రూపంలో చేసి ఒక పరికరంలో పోసి దానికి రసాయన ద్రావణాన్ని జోడిస్తున్నారు. ఐదు నిమిషాల తర్వాత ఆ ద్రావణంలో సూచికను ఉంచుతున్నారు. సూచికపై రెండు లైన్లు వస్తే అది నిషేధిత బీజీ-3 రకం విత్తనంగా నిర్ధారించుకుంటున్నారు. ఒకవేళ ఒక లైను వస్తే బీజీ-2 రకం పత్తి విత్తనంగా నిర్ధారిస్తున్నారు. నిషేధిత విత్తనాలుగా తేలితే వెంటనే విత్తనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వ్యాపారిపైన కేసు నమోదు చేస్తున్నారు.
విత్తన దందాపై ఉక్కుపాదం