ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు వారిళ్ల వద్దకే ‘ఐసొలేషన్ కిట్’ను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో చికిత్సకు అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లను సర్కారే ఉచితంగా సమకూర్చనుంది. హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా బాధితులకు కిట్లను అందజేయాలని ఆదేశించారు.
ఐసొలేషన్ అవస్థలను తప్పించడానికే..
కరోనా కేసులు ఉద్ధృతమవుతుండడంతో.. అంతే స్థాయిలో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నవారి (హోం ఐసొలేషన్) సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10వేల మందికి పైగా ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో తొలుత ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. రెండు మూడు రోజులు గడిచే సరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు స్వల్ప స్థాయిలోనైనా బయటపడుతున్నాయి. కొందరిలో లక్షణాలతోనే కొవిడ్ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తమ ఆరోగ్యంపై వారిలో ఆందోళన నెలకొంటోంది. ఏం మందులు వాడాలి? ఎలా వాడాలి? ఎవరిని సంప్రదించాలి? ఇటువంటి ఆలోచనలు భయాందోళనలను మరింత పెంచుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత.. ఆ వ్యక్తి ఇంట్లోంచి బయటకు రావడానికి వీలుండదు. మరో మనిషి తోడు లేని పరిస్థితుల్లో మందుల కోసం బాధితుడే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి కారణమవుతుందనే అవగాహన బాధితుల్లో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పైగా ఆ మందులు సరైనవేనా? ఎంత మోతాదులో వాడాలనే పరిజ్ఞానం కూడా ఎక్కువమందిలో ఉండదు.