నగరంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్వయం సహాయక బృందాల మహిళలు, జీహెచ్ఎంసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించింది. మహిళలతో పాటు వారి కుటుంబసభ్యులు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల కుటుంబ సభ్యులందరికీ కూడా కొవిడ్ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్
జంట నగరాల్లో 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు అందరికీ ఉచితంగా కరోనా టీకా ఇవ్వడానికి ఇప్పటికే 100 వాక్సిన్ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. తాజాగా స్వయం సహాయక బృందాల మహిళలు, జీహెచ్ఎంసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులందరికీ టీకాలు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ "స్పెషల్ డ్రైవ్" ప్రారంభించింది. ఇందులో భాగంగా బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో స్వయం సహాయక మహిళా బృందాలకు సమావేశాలు ఏర్పాటు చేసింది. వారు తమ కుటుంబ సభ్యులందరికీ విధిగా వ్యాక్సిన్ ఇప్పించేందుకు సమీపంలోని కేంద్రాలకు వెళ్లాల్సిందిగా సూచనలు చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన వంద కేంద్రాల్లో స్వయం సహాయక మహిళా బృందాలు, జీహెచ్ఎంసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులతోపాటు అన్ని వర్గాలకు టీకాలు ఇచ్చేలా కార్యక్రమం ఏర్పాటు చేశారు.