కరోనా రెండో దశ ఉద్ధృతితో ట్రావెల్స్ రంగం కుదేలైపోతోంది. లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఈ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రెండో దశ ప్రభావంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ప్రయాణికులు లేక క్యాబ్, మ్యాక్సీ, మినీబస్సులు, ఆటోల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. సెకండ్ వేవ్‌కు ముందు సాధారణ స్థితిలోకి వస్తుందన్న తరుణంలో తిరిగి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని వాపోతున్నారు.
టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమానుల గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షా 25 ట్రావెల్స్ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కో టూర్స్ అండ్ ట్రావెల్ కార్యాలయంలో చిన్న సంస్థ అయితే 5 మంది, పెద్ద సంస్థ అయితే సుమారు 500ల మంది వరకు పనిచేస్తారు. వీళ్లతో పాటు డ్రైవర్లు, క్లీనర్లు అదనంగా ఉంటారు. టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు అనుబంధంగా మెకానిక్‌లు, డెంటర్లు, పెయింటర్లు, రేడియం స్టిక్కర్లు వేసేవారు ఆధారపడి జీవిస్తుంటారు.
ఆర్థిక ఇబ్బందులు...
గ్రేటర్ పరిధిలో పనిచేస్తున్న ఐటీ సంస్థలకు, టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలకు సంబంధించిన సుమారు లక్షా 50వేల వాహనాలు తిప్పుతున్నారు. ఇప్పటికీ ఐటీ సంస్థలు చాలా వరకు వర్క్ ఫ్రం హోం నుంచే విధులు నిర్వహిస్తుండడం వల్ల వీటికి సంబంధించిన యజమానులు, డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి భారం...
సుమారు 80 వేలకుపైగా క్యాబ్‌లు ఉబర్, ఓలా తదితర క్యాబ్ దిగ్గజ సంస్థలకు అనుసంధానమై తిరుగుతుండగా, గత నెల రోజులుగా వీటి సంఖ్య 50 వేలకు పడిపోయినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, రాత్రింబవళ్లు ఎదురుచూసినా.. కనీస ఆదాయం లభించకపోవడం వల్ల చాలా మంది డ్రైవర్లు, వాహన యజమానులు క్యాబ్‌లను వదిలేస్తున్నారు. గత 10 రోజులుగా క్యాబ్‌ల వినియోగం గణనీయంగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌కు ముందు వేలాది మందికి ఉపాధినిచ్చిన క్యాబ్‌ల నిర్వహణ ఇప్పుడు భారంగా మారిందంటున్నారు.
బుకింగ్‌ల తగ్గుముఖం...
పెళ్లిళ్లు, వేడుకలు, సామూహిక ఉత్సవాలు వంటి వివిధ కార్యక్రమాల కోసం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ట్రావెల్స్ వాహనాల బుకింగ్‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. 8 సీట్లు, 10 సీట్లతో నడిచే మ్యాక్సీ క్యాబ్‌లు, 14 నుంచి 22 సీట్ల వరకు ఉండే మినీ బస్సులకు సైతం డిమాండ్ తగ్గినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. వచ్చే నెల వరకూ పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడం వల్ల వాహనాల వినియోగం ఉండకపోవచ్చని టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు వాపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది.
షెడ్డులకే పరిమితం...
కొవిడ్‌కు ముందు ప్రతిరోజూ సుమారు 20 నుంచి 30వేల వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు నగర సందర్శన కోసం వచ్చేవారు. ఏడాదికిపైగా అంంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుండగా... కొవిడ్ రెండో దశ ఉప్పెనలా వచ్చిపడింది. బుకింగ్‌లపై ప్రభావం పడినట్లు ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ట్రావెల్స్ వాహనాలు కేవలం షెడ్డులకే పరిమితమవుతున్నాయని అంటున్నారు.
ఎక్కువగా వ్యక్తిగత వాహనాలు...
ఐటీ సంస్థలకు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణులు చాలా వరకు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి, ఐటీ పరిసర ప్రాంతాలకు రోజుకు 10వేలకు పైగా క్యాబ్‌లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్యాబ్‌లు చాలా వరకు సాధారణ రాకపోకలపై మాత్రమే ఆధారపడి తిరుగుతున్నాయి. కానీ ప్రస్తుత రెండో దశ దృష్ట్యా అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే నగర వాసులు క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. ప్రజలు ఎక్కువ శాతం వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు.
నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలాఖరు వరకు ప్రజారవాణా వాహనాలకు డిమాండ్ పెరిగింది. తిరిగి కరోనా రెండో దశ ఉద్ధృతితో ప్రజారవాణాకు ఆదరణ తగ్గుతుందని టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తమ కుటుంబ పోషణ అత్యంత దయనీయంగా మారిపోతుందంటున్నారు. అప్పులు చేసి తిప్పులు పడుతున్న తమకు ఇది మరింత భారంగా మారుతుందని వాపోతున్నారు.
ఇదీ చదవండి:రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ ఆస్పత్రిగా గాంధీలో సేవలు