తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ప్రభావం: యానాంలో పడకేసిన పర్యటకం!

యానాం. ఈ పేరు చెప్పగానే ఎవ్వరికైనా అక్కడి అందాలు తనివితీరా చూడాలనిపిస్తుంది. గౌతమీ గోదావరి తీరంలో అలరారే ఈ కేంద్ర పాలిత ప్రాంతం... పర్యటకానికి నెలవు. అయితే... కరోనా తర్వాత యానానికి సందర్శకుల రాక తగ్గిపోవడంతో వెలవెలబోతోంది. సందర్శకుల తాకిడితో సందడిగా ఉండే ఈ ప్రాంతంలో పర్యటకం పడకేసింది.

corona effect on yanam tourism
కరోనా ప్రభావం: యానాంలో పడకేసిన పర్యటకం!

By

Published : Nov 6, 2020, 10:42 PM IST

కరోనా ప్రభావం: యానాంలో పడకేసిన పర్యటకం!

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం.. ఓ వైపు గౌతమీ గోదావరి, మరో వైపు సముద్రం, సందర్శనీయ ప్రదేశాలు, ఎన్నో ప్రత్యేకతలకు నిలయం.. నిత్యం ఇక్కడికి వందల సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. ఇక్కడి అందాలు తిలకించి ఆనందంగా గడిపేవారు. కొందరు రోజుల తరబడి మకాం వేసి ఈ తీర ప్రాంతంలో సరదాగా.. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేవారు. కరోనా ప్రభావంతో పరిస్థితి తారుమారైంది. మిగతా ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా ఆంక్షలు విధించారు. సందర్శకుల్ని నెలల తరబడి యానాం అనుమతించలేదు. పర్యటకంపై వచ్చే ఆదాయమే యానానికి ప్రధాన ఆదాయ వనరు. ఈ కారణంగా ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. తాజాగా కొవిడ్ ఆంక్షలు సడలించినా.. పర్యటకులు నామమాత్రంగానే వస్తున్నారు.

యానాం టవర్

ఫ్రాన్స్ దేశం అనుబంధంతో గిరియంపేటలో ఈఫిల్ టవర్ తరహాలో నిర్మించిన యానాం టవర్ సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనిపై నుంచి వీక్షిస్తే సముద్ర అందాలతోపాటు మడ అడవుల పచ్చదనం కళ్లను కట్టిపడేస్తుంది. గౌతమీ గోదావరి బీచ్​లో సంధ్యా సమయంలో విహారం హాయిగా ఉంటుంది. ఇక్కడే శివం బాత్, భారత మాత, ఎత్తైన జీసస్​ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇక్కడి నుంచి గోదావరి ఆవలి ఒడ్డున ఉన్న ఎదుర్లంక తీరంలోని కొబ్బరి తోటల అందాలు తనివితీరా వీక్షించేవారు. శని, ఆది వారాల్లో ప్రదర్శించించే లైటర్ లేజర్ షో సందర్శకులు లేక వెలవెల బోతోంది. నిత్యం రద్దీగా ఉండే అతిథి గృహాలు, రెస్టారెంట్లు ఏడు నెలలుగా బోసిపోయాయి.

పర్యటకంతోపాటు యానాంలో మద్యం దుకాణాలు నిత్యం రద్దీగా ఉండేవి. మన రాష్ట్రం కంటే 50 నుంచి 70 శాతం వరకు మద్యం ధరలు తక్కువగా ఉండేవి. మద్యం సేవించే మందుబాబులతో షాపులు కిటకిటలాడుతుండేవి. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. మద్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. 120 నుంచి 140 శాతం ధరలు పెరగడంతో స్థానికులే సమీప ప్రాంతాలకు వెళ్లి మద్యం కొంటున్నారు. పెట్రోలు, డీజిల్ పోయించుకునే వాహనాలతో బంకులు రద్దీగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడ పెట్రో ధరలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం పెట్రోలుపై కేవలం 5 రూపాయలు, డీజిల్​పై నాలుగు రూపాయలు మాత్రమే తక్కువగా ఉండటంతో వానానాలు కూడా తగ్గిపోయాయి.

పర్యటకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం, స్థానిక పర్యటక శాఖ మంత్రి, అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. యానాంలో పర్యటక సందడి ఎప్పుడు పెరుగుతుందా? అని స్థానికులు కూడా ఎదురు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details