- సార్! విద్యార్థులను ప్రమోట్ చేసినట్లే చేసి మళ్లీ భవిష్యత్తులో పరీక్షలు నిర్వహిస్తే ఎలా చదవగలడు? ప్రథమ సంవత్సరం పరీక్షలకు చదవాలా? ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవ్వాలా? -హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి తల్లి ప్రశ్న.
- ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మళ్లీ పెడతారా? అవి ఎప్పుడుండొచ్చు? నిర్వహించకుంటే మార్కులెలా ఇస్తారు? -పలువురు విద్యార్థుల ప్రశ్న.
విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు, పరీక్షల భయం తదితర అంశాలపై ఫోన్ చేసి ఉచితంగా కౌన్సెలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు నియమించిన ఏడుగురు సైకాలజిస్టులకు ఇదే అంశంపై అత్యధిక ప్రశ్నలు వచ్చాయి. అసలు పరీక్షలు నిర్వహిస్తారా? అయితే ఎప్పుడు? లేకుంటే మార్కులెలా ఇస్తారు? అనే ప్రశ్నలే ఎక్కువగా ఉంటున్నాయని సైకాలజిస్టులు పి.జవహర్‌లాల్ నెహ్రు, అనిత గోరె తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు చదవాలా? రెండో సంవత్సరం కోసమే సిద్ధం కావాలా? అని ఎక్కువమంది అడిగారు. తనకు ఈ నెల 18న తొలిరోజు మొత్తం 123 ఫోన్లు రాగా.. వాటిలో సగం మంది తల్లిదండ్రులు ఇవే ప్రశ్నలు అడిగారని పి.జవహర్‌లాల్ నెహ్రు తెలిపారు. ప్రథమ సంవత్సరం పూర్తయినవారు రెండో సంవత్సరంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని.. ఎంసెట్, జేఈఈ మెయిన్, నీట్‌లలో రెండేళ్ల సిలబస్ ఉంటుంది కాబట్టి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు రెండు సంవత్సరాలకూ సమ ప్రాధాన్యం ఇస్తే మంచిదని ఆయన సూచించారు. తల్లిదండ్రులు మార్కుల పేరిట పిల్లలపై ఒత్తిడి పెంచడం మంచిది కాదన్నారు.
మే నెల నుంచే ‘ద్వితీయ’ ఆన్‌లైన్ తరగతులు!
తొలి ఏడాది విద్యార్థులను ప్రమోట్ చేసిన నేపథ్యంలో.. వారికి మే మొదటి వారం నుంచి ఆన్‌లైన్‌లో ద్వితీయ సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు కార్పొరేట్ కళాశాలలు, కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మరికొన్ని కళాశాలలు ఈ నెల 22వ తేదీ నుంచే తరగతులు మొదలుపెడుతున్నాయని సమాచారం.