తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేస్తేనే రైతుబంధు, మద్దతు ధర

వర్షాకాలం నుంచే నియంత్రిత పద్ధతిలో వరిపంట సాగును ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రైతులకు లాభం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ విధానంలో పంటలు సాగు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతు బంధు ఇవ్వాలని... వాటికే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనే నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. సర్కార్ ప్రకటించిన పంటల విత్తనాలే అమ్మాలని, ఇందుకోసం విత్తన నియంత్రణా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కల్తీ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు బుధవారం నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగుతాయన్న ముఖ్యమంత్రి... అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నియంత్రిత పద్ధతిలో పంటలసాగు సహా సంబంధిత అంశాలపై చర్చించేందుకు క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు అధ్యక్షులతో 15న సీఎం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు.

ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేస్తేనే రైతుబంధు, మద్దతు ధర
ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేస్తేనే రైతుబంధు, మద్దతు ధర

By

Published : May 12, 2020, 9:47 PM IST

రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఈటల, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం.. సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే నానుడి రాష్ట్రంలో, దేశంలో ఎప్పట్నుంచో ఉందని... రైతు పండించిన పంటకు సరైన ధర రాని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతులు పండించిన పంటలకు మంచి ధరలు రావాలంటే ఏం చేయాలన్న విషయమై ఆలోచించుకోవాలన్న ముఖ్యమంత్రి... గత ప్రభుత్వాల తరహాలో ప్రేక్షకపాత్ర పోషించాలా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ప్రతి పార్టీ వ్యవసాయంపై చిత్తశుద్ధితో పనిచేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితి వేరని, ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతోందని సీఎం తెలిపారు. విద్యుత్ గండం గట్టెక్కడంతో పాటు భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతోందన్నారు. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి రాష్ట్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ మారు మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ఆయన... రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని చెప్పారు. వ్యవసాయాభివృద్ది – రైతు సంక్షేమం కోసం కంకణబద్ధమై పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ప్రపంచమే నేర్చుకోవాలని అభిలాషిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.

రైతులందరూ ఒకే పంటను పండించడం వల్లే గిట్టుబాటు ధర రావడం లేదని.. మార్కెట్ డిమాండ్​కు అనుగుణంగా పంటలు పండించాలని తాను 20 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల మార్పిడి, క్రాప్ కాలనీల గురించి ప్రధానమంత్రి మోదీకి కూడా పలుమార్లు చెప్పానని అన్నారు. అందరూ ఒకే పంట వేసే విధానం పోవాలన్న సీఎం... ఇష్టారీతిన పంటలు వేసి మార్కెట్ కు తీసుకొస్తే ఎవరూ కొనరని అభిప్రాయపడ్డారు. డిమాండ్ ఉన్న పంటల్నే సాగు చేయాలని సూచించారు. రైతులు ఏ పంట వేస్తే లాభపడతారో ప్రభుత్వమే చెప్పడంతో పాటు మద్దతు ధర ఇస్తామని.. ఇంతా చేస్తుంటే రైతులకు ఇంకా వేరే ఆలోచన ఎందుకని ప్రశ్నించారు. రైతుల ఆలోచనల్లో మార్పులు రావాలని ముఖ్యమంత్రి కోరారు.

ఈ వర్షాకాలంలో వరిపంటతో నియంత్రిత పద్ధతిలో సాగు చేసే విధానం ప్రారంభం కావాలని సమీక్షా సమావేశంలో కేసీఆర్​ నిర్ణయించారు. ఈ సారి 50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని.. సన్న, దొడ్డు రకాలతో పాటు పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకాన్ని పండించాలని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి, ఎంత విస్తీర్ణంలో పండించాలన్న విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుందని సీఎం తెలిపారు. ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగు చేసిన రైతులకే రైతుబంధు ఇవ్వాలని, వాటినే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, పది లక్షల ఎకరాల్లో కందులు పండించాలని కూడా తేల్చి చెప్పారు. పట్టణ ప్రాంతాల సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల వారీగా పండించాల్సిన కూరగాయలు, పరిమాణం తదితర అంశాలను ప్రభుత్వం రైతులకు సూచిస్తుంది.

ప్రభుత్వం నిర్ణయించిన పంటలు మాత్రమే సాగుచేయాలని నిర్ణయించినందున ఆ పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే అమ్మాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం విత్తన నియంత్రణా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై విత్తన తయారీ సంస్థలు, వ్యాపారులకు కచ్చితమైన ఆదేశాలు ఇస్తామన్న సీఎం... అవసరమైతే విత్తన చట్టంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. విత్తన కంపెనీ ప్రతినిధులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని మరోసారి స్పష్టం చేశారు.

పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం.. బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ పర్యటిస్తాయని తెలిపింది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెట్టినట్లు చెప్పింది. సమగ్ర వ్యవసాయ విధానానికి అనుగుణంగా వ్యవసాయశాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో పండించాల్సిన పంటలకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు ఎక్కువగా జరగాలని ఆదేశించింది. రైతుబంధు సమితిలు క్రియాశీలకంగా మారి రైతులను సమన్వయ పరచాలని కోరింది.

రాష్ట్రంలో పెద్ద ఎత్తువ పండుతోన్న వరిని బియ్యంగా మార్చేందుకు రైస్ మిల్లుల సామర్థ్యం పెరగాల్సిన అవసరం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైస్ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమావేశం కానున్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు, సంబంధిత అంశాలపై చర్చించేందుకు ఈ నెల 15న సీఎం దృశ్యమాధ్యమ సమీక్ష ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, వ్యవసాయ అధికారి, ఏడీఏ, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారి సమీక్షలో పాల్గొంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి, ఏఈఓలు, మండల, గ్రామ రైతుబంధు సమితి అధ్యక్షులు సమీక్షకు హాజరవుతారు.

ఇవీ చూడండి:పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన

ABOUT THE AUTHOR

...view details