Hyderabad Airport Express Metro Foundation : భాగ్యనగరంలో మరో భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు మైండ్‌స్పేస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పునాది వేశారు. అనంతరం అక్కడి నుంచి అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్లారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ప్రత్యేకతలివీ..
*విమానాశ్రయ మెట్రోలో ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు.
*ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించేలా సీట్లు (ఛైర్‌కార్లు) ఉంటాయి.
*ప్లాట్‌ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌లో మెట్రోరైలు ఆగిన తర్వాత కోచ్‌ల తలుపులు తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి.