JAGAN MEETING WITH PARTY LEADERS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసేనని ముఖ్యమంత్రి జగన్ తేల్చిచెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన సీఎం.. అందరూ కలిసికట్టుగా పనిచేసి.. ఆయన్ను గెలిపించుకు రావాలని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. వారిలో కొంతమంది ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘శ్రీనివాస్ అయితే గెలవడం కష్టమని.. ఆయన పార్టీలో ఎవ్వరినీ కలుపుకొని వెళ్లరని.. పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారని.. సీఎం ముందే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కుటుంబం అన్నాక ఇలాంటివి సహజం అన్న సీఎం.. కులాలు, కుమ్ములాటలన్నీ పక్కన పెట్టి .. అందరూ కలిసి పనిచేసి శ్రీనును గెలిపించుకు రండి.. అందరికీ న్యాయం జరుగుతుందని అన్నట్లు తెలిసింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా నియోజకవర్గంపై సీఎం చర్చించినట్లు సమాచారం.
శ్రీనును ఎమ్మెల్యేగా గెలిపించుకు వస్తే ఆయన ఎమ్మెల్సీ పదవిని గతంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్‌కు ఇస్తానన్న సీఎం.. అంతా కలిసి పని చేయకపోవడం వల్ల శ్రీను ఓడిపోతే.. ఆయన ఎమ్మెల్సీ పదవి కొనసాగించాలని కోరతారని అన్నట్లు తెలిసింది. కాబట్టి ఎమ్మెల్సీ పదవి కావాలనుకుంటే శ్రీనును ఎమ్మెల్యేను చెయ్’ అని తిలక్‌కు ఏపీ సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. అదే నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సమావేశంలో పాల్గొన్నారు. దువ్వాడకు మద్దతివ్వాలని ఆమెకూ సీఎం చెప్పారు. గ్రూపులు, కుమ్ములాటలు ఉన్నప్పుడు తనకు టికెట్ వస్తుందా రాదా అన్న అభద్రతా భావం ఉంటుందనే .. శ్రీనివాస్ పేరును ఇప్పుడే ఖరారు చేశానన్న సీఎం..అంతా ఆయనకు మద్దతివ్వాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.