మంత్రి రోజాకు సొంత పార్టీ నాయకుల నుంచినిరసన సెగ తప్పడం లేదు. తరచూ ఏదో ఒక రూపంలో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు గ్రామ సచివాలయం ప్రారంభించాలని మంత్రి రోజా భావించగా... వైకాపా జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి అందుకు ససేమిరా అన్నారు. ఒకే ప్రాంగణంలో నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే, పాల శీతలీకరణ కేంద్రానికి రూ.34 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇంకా రూ.23 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండగానే.. మంత్రి రోజా హడావిడిగా ప్రారంభించాల్సిన అవసరమేంటని మురళీధర్‌రెడ్డి ప్రశ్నించారు. బిల్లులు చెల్లించాకే ప్రారంభించాలంటూ భవన సముదాయనికి తాళాలు వేశారు. అలాగే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్యాహ్నం తర్వాత మంత్రి రోజా అనుచరులు తాళం పగలగొట్టడంతో... ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మురళీధర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు రవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో మంత్రి రోజా పత్తిపుత్తూరు చేరుకుని గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.