Raavisastri: రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావి శాస్త్రి) తన సాహిత్యంలో న్యాయవ్యవస్థపై చర్చించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాఖలోని అంకోసా హాల్లో జరిగిన రావిశాస్త్రి జయంతి వేడుకలకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రావిశాస్త్రి సృష్టించిన పాత్రలు శాసనసభ, చట్టాలపై మాట్లాడాయని ఆయన పేర్కొన్నారు. 'నిజం' అనే నాటకంలో పార్లమెంట్ గురించి రావిశాస్త్రి చర్చించారని తెలిపారు. మనిషి ఎంత ఘనుడో రావిశాస్త్రి తన సాహిత్యంలో చెప్పారని తెలియజేశారన్నారు. రావిశాస్త్రి ఎప్పుడూ తన ఫీజు గురించి ఆలోచించేవారు కాదని.. ఆయనకు ఫీజు కింద కొందరు కూరగాయలు కూడా ఇచ్చేవారని గుర్తు చేశారు. సాహిత్యాన్ని అభిమానించే వ్యక్తిగా ఇక్కడికి వచ్చినట్లు సీజేఐ తెలిపారు. మాండలీకాలతోనే తెలుగుభాష అభివృద్ధని.. విద్యార్థులకు తెలుగుభాష గొప్పతనం గురించి వివరించాలన్నారు. రాజ్యాంగంపై రావిశాస్త్రి ఎన్నో రచనలు చేశారని.. ఆయన చేసిన రచనలను ఆంగ్లంలో తర్జుమా చేయాలన్నారు.
న్యాయవ్యవస్థపై రావిశాస్త్రి చక్కని కవితలు చెప్పారు. తన రచనల్లో ప్రజలు, వారి కష్టాలను వివరించారు. వారానికి ఒకసారి వచ్చే 'రత్తాలు-రాంబాబు' కోసం ఎదురుచూసే వాళ్లం. విశ్వవిద్యాలయం.. సామాజిక ప్రయోగశాల. వర్సిటీ పాఠాల వల్లే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కోగలిగాం. ఆరు సారాకథలు చదివితే న్యాయవ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. ఆరు సారాకథల పుస్తకాలను అనేకమంది మిత్రులకు ఇచ్చా. రావిశాస్త్రి తన కథల్లో పార్లమెంట్, శాసనసభపై చక్కగా చెప్పారు. రాజ్యాంగం అందరికీ అర్థమయ్యేలా తన రచనల్లో రావిశాస్త్రి చెప్పారు. వ్యవస్థలపై నమ్మకం పోతే ఏమవుతుందో రచనల్లో తెలిపారు. సరిగాలేని, అమలుకాని చట్టాల గురించి చెప్పారు. -జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ