వ్యక్తిగత, కుటుంబ నేపథ్యం..
మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామం. మాది మధ్య తరగతి కుటుంబం. పదేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నాం. నాన్న మార్కెటింగ్ రిప్రజెంటేటివ్. అమ్మ సాధారణ గృహిణి. చెల్లెలు సాహితి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. నాన్న ఉద్యోగ రీత్యా వివిధ పాఠశాలలు మారాను. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చదివారు. తర్వాత శ్రీనిధిలో బీటెక్ చేశాను. చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్‌నే..మెరిట్ స్టూడెంట్ను కాదు.
కలాం మాటలు కదిలించాయి..
క్యాంపస్ సెలెక్షన్ లో కాగ్నిజెంట్‌లో ఉద్యోగం వచ్చింది. రోజుకు మూడున్నర గంటల ఖాళీ సమయం ఉండేది. ఖాళీ సమయంలో ఇంకా ఏదైనా చేయవచ్చునా అని ఆలోచించాను. భారత్ ప్రపంచశక్తిగా ఎదుగుతుందన్న అబ్దుల్ కలాం వాక్యాలు ఆకర్షించాయి. ఆ తర్వాత పత్రికల్లో అంతర్జాతీయ కథనాలు ఎక్కువగా చదవడం మొదలు పెట్టాను. ఆ క్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి కావాలనే కోరిక మొదలైంది. దాని కోసం సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టాను.
మొదటిసారి ఫెయిలయ్యాను.
కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల కొన్నాళ్లు ఉద్యోగం కొనసాగించాల్సి వచ్చింది. 2018 జనవరిలో ఉద్యోగం మానేశాను. అదే ఏడాది సివిల్స్ పరీక్ష రాశాను. అయితే ప్రిలిమ్స్ ఫెయిలయ్యాను. మళ్లీ ప్రయత్నం ప్రారంభించాను. మొదటి సారి చేసిన ప్రయత్నం, కోచింగ్ ఉపయోగపడింది. రోజూ టెస్టు రాశాను. అలా 70 టెస్టులు రాశాను. రోజూ ఉదయం టెస్టు రాయడం.. వాటిని విశ్లేషించుకొని.. మెరుగుపరుచుకుంటూ ప్రిపేర్ అయ్యాను. ప్రిలిమ్స్‌లో పాస్ అయితే ఓకే, లేకపోతే మళ్లీ ఉద్యోగం చేయమని ఇంట్లో అన్నారు. పొలిటికల్ సైన్స్ ఆప్షన్‌గా తీసుకున్నాను.