ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందని విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సర్కారు బడులకు విద్యార్థులు వెళ్లేలా ప్రమాణాలు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలని... డ్రాపవుట్స్ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు.
త్వరలోనే మార్పులు - REDDY
సర్కారు బళ్లకు విద్యార్థులు వచ్చేలా చేయాలి. పిల్లలు బడికి రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకోవాలి. అన్ని సౌకర్యాలు పక్కాగా కల్పించాలంటూ... అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి.
అనాథ పిల్లలకు గురుకులాల ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇచ్చే అంశంపై సీఎంతో చర్చిస్తానని మంత్రి తెలిపారు. అవసరమైన చోట పాఠశాల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, ఇతర సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఆన్లైన్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణలో మంచి మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలల పట్ల అనుసరించిన కఠిన వైఖరి వల్ల మార్పులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారని..త్వరలోనే భారీ మార్పులు ఉంటాయని తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.