Chandrababu Naidu in Sankranti Celebrations: ఏపీలోని నారావారిపల్లెలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబసభ్యులు, గ్రామస్థులతో కలిసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు పండుగను వైభవంగా జరుపుకొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో.. గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్న నారా, నందమూరి కుటుంబాలు తరతరాల సంప్రదాయాన్ని కొనసాగించారు. సన్నిహితులు, స్నేహితులు, బంధువులతో రెండు రోజుల పాటు సరదాగా గడిపారు.
ఉద్యోగాలు, ఉన్నత చదువులు, వ్యాపారాలు అంటూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వ్యక్తులంతా.. సంక్రాంతి పండుగును సొంతూళ్లలో జరుపుకోవాలనే సూచించే చంద్రబాబు.. ఈ సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో ఘనంగా జరుపుకొన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి పండుగను జరుపుకుంటూ సరదాగా, సంతోషంగా గడిపారు. ఉదయం కుటుంబసభ్యులతో కలిసి గ్రామ దేవతలైన సత్యమ్మ, నాగాలమ్మల దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు:చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు వేడుకల్లో పాలుపంచుకున్నారు. సంప్రదాయ దుస్తులతో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు జరిపిన అనంతరం తన తల్లిదండ్రులు నారా అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు సమాధులకు చంద్రబాబు నివాళులర్పించారు. తన నివాసం ఎదుట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.