ప్రైవేటు విద్యాసంస్థలు పెరగడం, ప్రభుత్వ విద్యకు కేటాయింపులు తగ్గడంతో విద్య అందరికీ అందుబాటులో లేకుండా పోతోందని సామాజిక, ఆర్థిక అధ్యయన కేంద్రం(సెస్) వెల్లడించింది. సర్కారీ విద్యపై డిమాండ్‌కు తగ్గట్లుగా కేటాయింపులు లేకపోవడం వల్ల విద్య ప్రైవేటీకరణ వేగంగా జరుగుతోందని వివరించింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యపై ఏడు దశాబ్దాలుగా కేటాయింపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లపై పరిశోధన పత్రాలను సెస్ విడుదల చేసింది. రానున్న పదేళ్లలో ప్రభుత్వ విద్యపై ఖర్చులు మరింత తగ్గే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ విద్యపై కేటాయింపులు తగ్గిపోతున్నాయ్: సెస్
దేశంలో ఉన్నత విద్య లక్ష్యాలు సాధించేందుకు ప్రభుత్వ విద్యపై కేటాయింపులు గణనీయంగా పెంచాల్సిన అవసరముందని సామాజిక, ఆర్థిక అధ్యయన కేంద్రం(సెస్) అధ్యయనం పేర్కొంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏటా ప్రభుత్వ విద్యారంగానికి నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయని తెలిపింది.
అధ్యయనంలో ముఖ్యాంశాలివి..
*రాష్ట్రాల బడ్జెట్‌లతో పోల్చితే కేంద్రం విద్యపై చేస్తున్న ఖర్చు తక్కువగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా కింద నిధులు వెచ్చించాలి.
*విద్యాభివృద్ధికి ప్రభుత్వ విద్యపై ఖర్చు పెరగాల్సిన అవసరముంది.
*నూతన విద్యావిధానంలో భాగంగా విద్యారంగంపై ఖర్చును జీడీపీలో 4 నుంచి 6 శాతానికి పెంచాలి.
*రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధితోపాటు ఇతర బాధ్యతలు స్వీకరిస్తున్నందున జాతీయ విద్యా విధానం అమల్లో రాష్ట్రాలపై భారాన్ని తగ్గిస్తూ నిధులు పెంచాలి.
ఇదీ చూడండి:బదిలీ చేస్తారేమోనని.. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల్లో గుబులు