CEIR in Telangana to block stolen mobile: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ మన శరీరంలో ఒక భాగమైపోయింది. ఒక పూట తిండి లేకున్నా నేటి తరంవాళ్లు బతికేస్తారు కానీ.. అరక్షణం మొబైల్ చేతిలో లేకపోతే మాత్రం బతకలేరు. ప్రస్తుతం మనలో ఇంతలా భాగమైన మొబైల్ ఫోన్‌కు ఓ ఆపద వచ్చిపడింది. ముఖ్యంగా తెలంగాణలో మొబైల్ చోరీలు ఎక్కువయ్యాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోసగటున ఏడాదికి 30వేలకుపైగా ఫోన్లు చోరీ అవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
CEIR in Telangana to block lost mobile: ఒకప్పుడు బయటకు వెళ్తే జేబులో పర్చు భద్రంగా చూసుకునేవారు. ఇప్పుడు మొబైల్ ఫోన్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. కాస్త ఏమరపాటుగా ఉన్నామంటే చాలు.. ఇట్టే కాజేస్తున్నారు దొంగలు. ముఖ్యంగా రాష్ట్రంలోని రైతుబజార్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే రద్దీగా ఉండే ప్రాంతాల్లో 'సెల్‌ఫోన్ దొంగలున్నారు జాగ్రత్త' అనే బోర్డులు కూడా పెడుతున్నారు.
CEIR blocks stolen mobile: ప్రస్తుతం రాష్ట్రంలో మొబైల్ ఫోన్ చోరీ అయినట్లు ఫిర్యాదు ఇచ్చినా.. పోలీసుల నుంచి అంతగా స్పందన ఉండదు. ఎందుకంటే మొబైల్ ఫోన్ పట్టుకునేంత సమయం, దానికి సరైన వ్యవస్థ మన పోలీసుల వద్ద లేకపోవడమే. ధనవంతులకు ఫోన్ చోరీ అవ్వడం పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ పేద, మధ్యతరగతి వాళ్లకు మొబైల్ ఫోన్ ఓ లగ్జరీ. ఎన్నో నెలలు కష్టపడి.. నెలనెల ఈఎంలు చెల్లిస్తూ సెల్‌ఫోన్ కొంటుంటారు. అలాంటి ఫోన్‌ను అకస్మాత్తుగా ఎవరో ఎత్తుకెళ్తే..? అందుకే వీరి బాధను అర్థం చేసుకున్న తెలంగాణ పోలీసులు మొబైల్ ఫోన్ చోరీలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఏకంగా సీఐడీ విభాగం రంగంలోకి దిగుతోంది.
రాష్ట్ర సీఐడీ విభాగం.. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (సీఈఐఆర్)' తో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. సీఈఐఆర్ సాయంతో చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాదు.. అందులో వేరే సిమ్‌కార్డు వేయడానికి ప్రయత్నిస్తే.. ఇట్టే వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం దిల్లీ, ముంబయి, బెంగళూరు పోలీసులు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేసి మొబైల్ ఫోన్ దొంగల్ని పట్టుకుంటున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ ఇది అమల్లోకి రానుంది.
సీఈఐఆర్ అంటే ఏంటంటే.. సెల్‌ఫోన్ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సీఈఐఆర్‌ను ప్రారంభించింది. ఫోన్ పొగొట్టుకున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి, కేసు నమోదైన తర్వాత సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ వివరాలు నమోదైన తర్వాత చోరీ అయిన ఫోన్‌ను.. ఐఎంఈఐ నెంబరు ద్వారా బ్లాక్ చేస్తారు. చోరీ చేసిన వ్యక్తి దానిలో వేరే సిమ్ కార్డు వేయాలని ప్రయత్నిస్తే ఆ విషయం కూడా పోలీసులకు తెలిసిపోతుంది. దాని ద్వారా ఆ సిమ్ కార్డు చిరునామా వంటి వివరాలను సేకరించి తద్వారా ఫోన్ చోరీ చేసిన వ్యక్తిని పట్టుకోవచ్చు.