ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన భావనపాడు పోర్టు (ఓడరేవు) నిర్మాణపనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం పంపిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎఫ్) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అవసరం లేకున్నా తీసుకున్న మూడు ఆవాసాలను భూసేకరణ నుంచి మినహాయిస్తారని, దాంతో డీపీఆర్‌లో రూ.1,500 కోట్ల వ్యయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు మార్చి మళ్లీ పంపాలి. దీనివల్ల టెండర్లలోనూ జాప్యం జరుగుతుందని అంటున్నారు.
ఏపీలో మూడు రేవులను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. దీనికోసం ఎస్పీవీలను ఏర్పాటుచేసింది. పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వ హామీతో రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం మారిటైం బోర్డుకు కల్పించింది. మూడు రేవుల నిర్మాణానికి రైట్స్ సంస్థ రూపొందించిన డీపీఆర్‌లను ఆమోదించింది. ఇందులో రామాయపట్నం, భావనపాడు రేవులను ఈపీసీ విధానంలో నిర్మించటానికి కాంట్రాక్టు సంస్థల ఎంపిక కోసం టెండర్లను పిలిచింది.
* ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం రేవు మొదటి దశను రూ.2,646.84 కోట్లతో చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ మారిటైం బోర్డు 2020-21 ప్రామాణిక ధరల ప్రకారం టెండర్లను పిలిచింది. ఈ నెల 15 నాటికి టెండర్ల దాఖలు గడువు ముగిసినా.. ఎక్కువ మంది గుత్తేదారులకు అవకాశం కల్పించటానికి 28 వరకు పొడిగించారు. గడువు ముగిశాక నిర్మాణ సంస్థను ఎంపిక చేసి, పది రోజుల్లోగా లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ (ఎల్‌వోఏ) జారీచేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.