రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. మర్పల్లి సమీపంలో రోడ్డుపై జరిగిన చిన్న పంచాయితీకి ఓ వ్యక్తి పెద్ద మనిషిగా వెళితే ప్రాణం పోయింది. ప్రశాంత్, సతీష్ అనే ఇద్దరు కారులో వెళుతున్నారు. ఈక్రమంలో శ్రీనాథ్ అనే వ్యక్తి ద్విచక్రవాహనం తగిలింది. కారులోని వ్యక్తులు శ్రీనాథ్‌తో ఘర్షణకు దిగారు. ఇది గమనించిన శ్రీనాథ్ సహోద్యోగులు పరమేశ్వర్, రాజులు ఘర్షణను నిలువరించే ప్రయత్నం చేశారు.
తప్పని చెప్పినందుకు చంపేశారు!
రోడ్డుపై జరిగిన గొడవను ఆపేందుకు వెళ్తే ప్రాణాలు పోయాయి. చిన్న పంచాయితీకి పెద్దమనిషిగా వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది.
'మాకే నీతులు చెప్తారా' అంటూ పరమేశ్వర్, రాజులను కారులోని వ్యక్తులు చితకబాదారు. అంతే కాకుండా బలవంతంగా కారు ఎక్కించుకున్నారు. కొద్దిదూరంలోనే ఆ కారు బోల్తా పడగా... పరమేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. నిందితులు ప్రశాంత్, సతీష్‌లు కారును అక్కడే వదిలి పరారయ్యారు. సతీశ్, ప్రశాంత్‌లు పాత నేరస్థులేనని... నిన్న ఓ కేసులో కోర్టుకు హాజరైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘర్షణతో సంబంధం లేని వ్యక్తి మరణంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం... ఒకరి అరెస్ట్