జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగడానికి ముందే... సన్నాహాలు ప్రారంభించిన భారతీయ జనతాపార్టీ... ఇప్పుడు ప్రకటన వెలువడటంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. వరుస సమావేశాలు, అభ్యర్థుల అన్వేషణ, మ్యానిఫెస్టో రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. బల్దియా పోరులో పైచేయి సాధించేందుకు...అధికార తెరాసకు దీటుగా ఆరు నెలలుగా క్షేత్రస్థాయిలో.. భాజపా పక్కా వ్యూహాలు రచించింది. వరద బాధితులకు అందాల్సిన సాయంలో అవకతవకలు జరిగాయన్న వాదనను.. పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది. " మన హైదరాబాద్ మన తెలంగాణ” , "అందరికీ అవకాశం ఇచ్చారు మాకు అవకాశం ఇవ్వండి “, " మార్పు కోసం భాజపా ”, "భాజపా కోసం మనం" అనే నినాదాల్లో ఏదో ఒకటి తీసుకుని ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని కాషాయదళం యోచిస్తోంది.
డివిజన్ల వారీగా సర్వేలు
ఇప్పటికే డివిజన్ల వారీగా సర్వేలు నిర్వహించిన భాజపా.... బలమైన అభ్యర్థులను గుర్తించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన, ఇతర పార్టీల నుంచి భాజపాలో చేరిన సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ ఇవ్వాలని సూత్ర పాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. తెరాస, కాంగ్రెస్ అసంతృప్తులు, టికెట్ దక్కే అవకాశంలేని బలమైన నాయకులను చేర్చుకునే ప్రయత్నాలను కమలదళం ముమ్మరం చేసింది. మొదట 30 నుంచి 40 డివిజన్లకు తొలి విడత అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసింది.
కీలక నేతలను ఇంఛార్జీలుగా
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ముఖ్యనేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, మురళీధర్ రావు, డీకే.అరుణతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌నేతలు పలుమార్లు సమావేశమై పార్టీ వ్యూహాలపై చర్చించారు. పార్టీ అనుబంధ సంఘాలైన బీజెవైయం, మహిళామోర్ఛా, కిసాన్ మోర్ఛా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మోర్చాలతో.... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమావేశమై క్షేత్రస్థాయి ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ మేనిఫెస్టోను మాజీ ఎంపీ వివేక్ నేతృత్వంలో చంద్రవదన్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కర్ణాగోపాల్, ప్రకాశ్ రెడ్డి సభ్యులతో కూడిన కమిటీ రూపకల్పన చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తరువాత గత ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు, వంద రోజుల ప్రణాళికపై ఛార్జిషీట్ వేయనుంది. మరుసటి రోజు మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు....... కీలక నేతలను ఇంఛార్జీలుగా ఇతర సీనియర్ నేతలకు డివిజన్ల బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది.
2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా