BJP Deeksha: బడ్జెట్ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ నుంచి సెషన్ పూర్తయ్యే వరకు భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా నల్ల కండువాలతో తమ స్థానాల్లో కూర్చొని నిరసన తెలిపితే ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించుకున్న భాజపా.. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ధ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టింది. మొదట భాజపా దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉదయం అనుమతి ఇచ్చారు. భాజపా కోరిన సమయాన్ని కుదిస్తూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకే దీక్షకు అనుమతి ఇచ్చారు. భాజపా దీక్షతో ఇందిరా పార్కు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. బారికేడ్లతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా..
తెలంగాణ బడ్జెట్ అంతా దొంగ లెక్కలు.. కాకి మాటలే ఉన్నాయని మాజీమంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్, హరీశ్ రావుకు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారు కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ పీకేను పెట్టుకున్నారని విమర్శించారు. బంగాల్‌లో కాలు ఇరగకముందే పట్టి కట్టించిండు.. ఇక్కడ ఏమీ కాకముందే ఆస్పత్రికి తీసుకుపోయాడన్నారు. ఈ పీకేల వల్ల ఏమీ కాదన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ వ్యక్తులు కాదు.. శక్తులని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బండి సంజయ్ కోసం అమిత్ షా బుల్డోజర్‌ను బహుమతిగా పంపిస్తున్నారన్నారు. తెలంగాణలోని అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లను పంపిస్తామని హెచ్చరించారు.
30 రోజులు జరగాల్సిన సమావేశాలు ఏడు రోజులే..
"గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 30 రోజులు జరగాల్సిన సమావేశాలను ఏడు రోజులే నిర్వహించారు. మా హక్కులను కేసీఆర్ హరించారు. సీఎం ఇచ్చిన స్లిప్పుతో మమ్మల్ని సభాపతి సస్పెండ్ చేశారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కోర్టు ఇచ్చిన తీర్పునూ స్పీకర్ గౌరవించలేదు. భాజపాకు ఇక మిగిలింది ప్రజాక్షేత్రం మాత్రమేనని నిర్ణయించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టాం." ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
బుల్డోజర్ వస్తోంది..
"తెలంగాణకు బుల్డోజర్ వస్తోంది. యూపీలో ఆదిత్యనాథ్ బుల్డోజర్‌తో అవినీతిపరులను తొక్కించారు. రాష్ట్రంలో అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లు పంపిస్తాం. బండి సంజయ్ కూడా బుల్డోజర్‌కు ఆర్డర్ ఇచ్చారు. భాజపా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులకు భాజపా శ్రేణులు ఏమాత్రం భయపడేది లేదు." -రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే