BJP Bheem Deeksha: రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు దీక్షలు చేయాలని భాజపా పిలుపునిచ్చింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు దిల్లీలో మౌనదీక్ష చేయనున్నారు. ఆ పార్టీ ఎంపీలతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి రాజ్‌ఘాట్ వద్ద నిరసన తెలపాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా.. బండి సంజయ్ సహా ఎంపీలు అర్వింద్. సోయం బాపూరావు ప్రస్తుతం దిల్లీలోనే ఉన్నారు.
దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 'భాజపా భీం దీక్ష' పేరుతో దీక్ష చేయాలని కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు దీక్ష చేయాలని సూచించింది. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే భీం దీక్షలో పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా శాసనసభాపక్షనేత రాజాసింగ్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు పాల్గొననున్నారు.
ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. భాజపా, కాంగ్రెస్, తెజస, బీస్పీ సహా ఇతర నేతలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.