తెలంగాణ

telangana

ETV Bharat / state

BIO BRICKS: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు... వ్యర్థాలతో ఇటుకలు

వ్యవసాయ వ్యర్థాలు పర్యావరణానికి సమస్యగా మారుతున్నాయి. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే కాలుష్యంపై ఏకంగా సుప్రీం కోర్టే స్పందించింది. నిర్మాణాల్లో ఉపయోగించే ఇటుకల తయారీలోనూ భారీగా కాలుష్యం ఏర్పడుతుంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపేలా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు విన్నూత్న ఆవిష్కరణ చేశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఉన్న ఆ పరిష్కారమే బయో బ్రిక్స్.

BIO BRICKS
BIO BRICKS

By

Published : Sep 4, 2021, 10:55 AM IST

వరి, గోధుమ, చెరకు, పత్తి, కంది వంటి పంటలు దేశంలోని దాదాపు అన్నీ రాష్ట్రాల్లో సాగు అవుతున్నాయి. కోతల తర్వాత ఈ పంటల నుంచి పెద్ద ఎత్తున వ్యర్థాలు మిగిలిపోతుంటాయి. సాధరణంగా రైతులు ఈ వ్యర్థాలకు మంట పెట్టి కాల్చుతున్నారు. ఇవి కాల్చడం వల్ల కార్బన్​తో పాటు విషపూరితమైన వాయువులు భారీగా పర్యావరణంలో కలుస్తున్నాయి. పంజాబ్ పొలాలో వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడిన పొగ దిల్లీ వాసులను ఊపిరి పీల్చుకోలేని స్థితికి తీసుకెళ్తోంది.

నిర్మాణంలో ఉపయోగించే మట్టి ఇటుకల తయారీలో భాగంగా రోజుల తరబడి బట్టీలను మండిస్తారు. దీని వల్ల ప్రమాదకర పొగ, ధూళి గాలిలో కలుస్తున్నాయి. సిమెంట్ ఇటుకల తయారీలో ప్రధానంగా ఉపయోగించే సిమెంట్ తయారీ వల్ల కూడా పర్యవరణానికి ముప్పు కలుగుతోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపేలా ఐఐటీ హైదరాబాద్​లో డిజైన్ విభాగం ఓ ఆవిష్కరణ చేసింది. పంట వ్యర్థాలతో ఇటుకల తయరీనే దీని ప్రత్యేకత.

ఓ గదిని సైతం నిర్మించి..

డిజైన్ విభాగం ఆచార్యుడు దీపక్ జాన్ మాథ్యూ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ప్రియాబ్రత రౌత్రే ఈ ఇటుకలను రూపొందించారు. పంట వ్యర్థాలను చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి దానికి సున్నం కలిపి అచ్చుల్లో పోసి అరబెట్టడం ద్వారా ఈ బయో ఇటుకలను తయారు చేశారు. ఈ మిశ్రమంతో నేరుగా గోడలను సైతం నిర్మించవచ్చు. ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఇలా ఓ గదిని సైతం నిర్మించారు. ఈ గదిని గురువారం ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి బయో ఇటుకల నిర్మాణం ఇదే కావడం విశేషం. వీరి పరిశోధన వివరాలు రెండు ప్రముఖ జర్నల్స్​లో సైతం ప్రచురితం అయ్యాయి. ఈ ఇటుకల తయారీపై వీరికి మేథో హక్కులు సైతం లభించడం విశేషం.

ఈ మిశ్రంతో కేవలం ఇటుకలే కాకుండా పైకప్పు సీలింగ్ కోసం ఉపయోగించవచ్చు. వీరు రూపొందించిన ఈ ఇటుకలకు అగ్ని నిరోధక గుణం సైతం ఉంది. దీనితో పాటు ఉష్ణ, శబ్ధ నిరోధకాలుగానూ పని చేస్తుంది. ఈ బయో ఇటుకలతో నిర్మించిన ఇంట్లో 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత్త తేడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధరణ ఇటుక బరువులో ఇవి పదో వంతు మాత్రమే ఉండటమే కాకుండా ధర కూడా తక్కువగా ఉంటుంది. ఈ ఇటుకల తయారీ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులకు అదనపు ఆదాయ మార్గంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఆవిష్కరణను ప్రియాబ్రత రౌత్రే గత సంవత్సరం కరోనాతో చనిపోయిన తన తండ్రికి అంకితం ఇచ్చారు.

ఇదీ చూడండి:WEATHER REPORT: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఇవాళ, రేపు భారీ వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details