తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'

CM KCR
CM KCR

By

Published : Jul 26, 2021, 11:04 AM IST

Updated : Jul 26, 2021, 7:35 PM IST

11:02 July 26

CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'

CM KCR: 'దళితబంధు' కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం

దళిత బంధు పథకంపై ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్సీ ప్రతినిధులతో సమావేశమైన సీఎం.. పథకం లక్ష్యాలు, అమలు, కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దళితబంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమమని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం విజయవంతం చేయాలని సూచించారు. పథకం అమలు ప్రభావం యావత్ తెలంగాణపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఈ స్కీమ్ విజయవంతానికి అందరూ దృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు.

తెలంగాణ ఉద్యమం ఒక్కడితో ప్రారంభమైందన్న సీఎం.. భారత రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించామని గుర్తు చేశారు. నమ్మిన ధర్మానికి కట్టుబడి కొనసాగితేనే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. మనిషిని మనిషి వివక్ష చూపే దుస్థితిపై అధ్యయనం చేశానన్న కేసీఆర్​.. మనలో పరస్పర విశ్వాసం, సహకారం పెరగాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వం పెంచుకుంటేనే విజయానికి బాటలు వేయొచ్చని హితవు పలికారు.

ప్రతిభావంతులైన ఎస్సీలను దూరం పెట్టారు..

ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. దళితబంధు విజయంతో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమమవుతుందన్నారు. అంటరానితనం పేరుతో ప్రతిభావంతులైన ఎస్సీలను దూరం పెట్టారని.. ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం దుర్మార్గమన్న కేసీఆర్​.. ఎస్సీ మహిళ లాకప్‌డెత్‌ కేసులో దోషులైన పోలీసులను తొలగించామని తెలిపారు.  

 

ఆ రంగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు..

ఎస్సీలకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్న ముఖ్యమంత్రి.. స్వీయ అభివృద్ధికి ఎస్సీలు పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని.. ఉపాధి రంగాలు గుర్తించి లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. లబ్ధిదారుల భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన దళిత రక్షణనిధి ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల కమిటీతో దళిత రక్షణనిధి నిర్వహణ ఉంటుందన్నారు.

హుజూరాబాద్ గెలుపు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది..

ఏటా కనీస డబ్బు జమ చేస్తూ దళిత రక్షణనిధి నిరంతరం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. మరింత పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా రక్షణనిధి ఏర్పాటు చేస్తామని.. ఎస్సీలు విజయం సాధించి వెలుగు దివ్వెలు, కరదీపికలుగా మారాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. హుజూరాబాద్ గెలుపు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

దేశమంతా అమలుకు కేంద్రంపై ఒత్తిడి.. 

అంబేడ్కర్​ ఆశయాలకు అనుగుణంగా దళితులను పులులుగా మార్చే అవకాశం సీఎం కేసీఆర్ అమలు చేయబోయే దళిత బంధు పథకం ద్వారా సాధ్యం అవుతుందని సీపీఎం నేత, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. ఈ విశ్వాసం కలిగాకే తాను సమావేశానికి వచ్చానన్నారు. రాష్ట్రంలో విజయం సాధించిన తర్వాత దళిత బంధు లాంటి పథకం దేశమంతా అమలుచేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. దళితులు వృథా ఖర్చులు చేస్తారనే అపోహను పటాపంచలు చేసి, అవకాశాలు వస్తే సద్వినియోగం చేసుకుంటారని.. దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసి చూపిద్దామని వెంకట్​ అన్నారు. హుజురాబాద్​లో విజయం సాధించి దేశ దళితజాతి ఆర్థికాభివృద్ధికి దారులు వేద్దామన్న వెంకట్​.. దళిత జాతి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుదామని సూచించారు.

యజ్ఞంలా పనిచేయాలి..

అరకొర నిధులతో గతపాలకులు దళితుల కోసం అమలు చేసిన పథకాలు వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేయలేదని సీపీఐ నేత బాలనర్సింహ విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా పది లక్షల రూపాయలతో సీఎం కేసీఆర్ అమలుచేయబోతున్న దళిత బంధు విప్లవాత్మక మార్పునకు దారులు వేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా దళితబంధు వంటి పథకం అమలుకోసం పోరాడతామని చెప్పారు. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కాకపోతే దాని ప్రభావం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పడుతుందన్నారు. యజ్ఞంలా పనిచేసి హుజూరాబాద్​ దేశానికే దిక్సూచి అయ్యేలా విజయవంతం చేయాలని నరసింహా కోరారు. దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్​కు ధర్యావాదాలు తెలిపారు. సదస్సుకు హాజరైన వారందరికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశాన్ని కొనసాగించి.. సాయంత్రానికి ముగించనున్నారు.

ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు.. 

దళితవాడల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారు. పదిరోజుల్లో హుజూరాబాద్‌లో దళితుల భూసమస్యలు పరిష్కరించాలని.. పరిష్కారానికి కలెక్టర్‌ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు. హుజూరాబాద్‌లో ఇల్లులేని దళిత కుటుంబం ఉండకూడదన్నారు. ఖాళీ స్థలముంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్‌లో ప్రతి ఎస్సీ వాడలో పర్యటించాలని.. వ్యాధులతో బాధ పడుతున్న వారిని గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. ఎస్సీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుందన్నారు. డిజిటల్ సంతకాల పెండింగ్ సహా హుజూరాబాద్ దళిత ప్రజల అన్ని సమస్యలను గుర్తించి వారిని కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకొని పరిష్కరించాలని కలెక్టర్​ను ఆదేశించారు. రాష్ట్రంలోని దళితుల స్వాధీనంలో ఉన్న గ్రామకంఠాల భూముల వివరాల జాబితా తయారు చేయాలని, వారికి హక్కులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణాలోని అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్టే, దళితబంధు పథకాన్ని చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునేలా పనిచేయాలని హుజూరాబాద్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

డబ్బుతో చిప్‌ కార్డు

దళితబంధు పథకం లబ్ధిదారులకు గుర్తింపు కార్డు ఇస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ఐడీ కార్డు ఇస్తామని.. పథకం అమలు తీరుపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తామన్నారు. లబ్ధిదారుడు తాను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

CM KCR On Dalit Bandhu: దళిత బంధు కోసం రూ.లక్ష కోట్లు: సీఎం

Last Updated : Jul 26, 2021, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details