బడ్జెట్‌పై రెండో రోజు చర్చలో భాగంగా ఇవాళ నాలుగు పద్దులపై చర్చ జరిగింది. పురపాలక, ఇంధన, రహదార్లు-భవనాలు, నీటిపారుదల శాఖల పద్దులను మంత్రులు సభలో ప్రవేశపెట్టిన అనంతరం చర్చ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులు మెరుగుపరచాలని, రహదార్లు అభివృద్ధి చేయాలని మజ్లిస్ సభ్యుడు కౌసర్ కోరారు. నీటిపారుదల ప్రాజెక్టులు యుద్ధప్రాతిదికన పూర్తి చేస్తూ కేసీఆర్... దేశానికే ఆదర్శంగా నిలిచారని బాల్క సుమన్ అన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తాము సంతోషించామన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... బడ్జెట్‌ను చూస్తే నిరుత్సాహం కలిగిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చారని ఆక్షేపించారు. ఇష్టం ఉన్న ప్రాజెక్టులనే చేపడుతున్నారని... నల్గొండ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. సమాధానమిచ్చిన మంత్రులు... రాజగోపాల్ రెడ్డి ఆరోపణలను తోసిపుచ్చారు.
మెట్రో రైలును శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తాం:
పురపాలక శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్న మంత్రి కేటీఆర్... కొత్త మున్సిపాలిటీల్లో వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. భాగ్యనగరంలో రోడ్ల మెరుగుదలకు రూ.2300 కోట్లు, పారిశుద్ధ్యం కోసం రూ.800 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని కేటీఆర్ వివరించారు. మూసీ సుందరీకరణ హామీకి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం పూర్తితో నగరవాసులకు శాశ్వతంగా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపామని చెప్పారు. మెట్రో రైలును శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తామని చెప్పారు
రహదార్ల విషయంలో 50 ఏళ్లలో చేయనిది ఐదేళ్లలో చేశామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి... రహదార్లకు రూ.12,405కోట్లు, భవనాలకు రూ.598 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. చీకట్లను అధిగమించి రాష్ట్రానికి వెలుగులు పంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని... కాళేశ్వరం సహా ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకున్నామని తెలిపారు.