అష్టావక్రుడు ఆత్మజ్ఞాని. ఆయన ప్రవచించిన అష్టావక్ర గీత అద్భుతమైన జ్ఞానబోధ చేస్తుంది. ఇతని ప్రస్తావన మహాభారతంలో కనిపిస్తుంది. తల్లి సుజాత, తండ్రి ఖగోదరుడు. అస్టావక్రుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి వేదాలను అసంబద్ధంగా పఠించాడు. దాన్ని ప్రశ్నించడంతో ఖగోదరుడు ‘నీ మనసులాగే నీ శరీరం కూడా వక్రంగా ఉంటుంద’ని శపించాడు. ఫలితంగా ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో జన్మించాడు.
అడుగడుగునా అపహాస్యాలే..
శారీరకంగా వైకల్యం ప్రాప్తించినా వేదవేదాంగాల్లో అష్టావక్రుడు అసాధారణ ప్రజ్ఞను సంపాదించగలిగాడు. జ్ఞానపూర్ణుడయ్యాడు. పన్నెండేళ్ల వయసులో ఓ రోజు సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు కొలువుకు వెళ్లాడు. శారీరక వైకల్యం కారణంగా ఆయనకు వెళ్లిన ప్రతిచోటా అవమానాలు ఎదురయ్యేవి. జనక మహారాజు కొలువులో కూడా అలాగే జరిగింది. అష్టావక్రుడు అడుగు పెట్టగానే అపహాస్యాలు వినిపించాయి. తలపండిన మేధావులు, పండితులు కూడా సాధారణ జనం మాదిరిగానే అతడిని చూసి గేలిచేయడం ప్రారంభించారు. వారి వైఖరి చూసిన అష్టావక్రుడు బిగ్గరగా నవ్వసాగాడు. ఒక్కసారిగా జనకుడు అమితాశ్చర్యంతో ‘అష్టావక్రా! వారందరూ ఎందుకు నవ్వుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు అవగతం కాలేదు’ అన్నాడు.