ఏపీలో ఆగస్టు 16 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Army recruitment rally) నిర్వహించనున్నారు. ఫిజికల్, మెడికల్, రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం స్టైపెండ్‌తో కూడిన శిక్షణ ఉంటుంది. ఉద్యోగంలో (Army job notification) చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.35 వేల వేతనంతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు.
ఆర్మీలో ప్రారంభ స్థాయి (ఎంట్రీ లెవెల్) ఉద్యోగాల భర్తీకి (Employment Notification) ప్రాంతాలవారీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రం లేదా అందులోని కొన్ని జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి స్థానికులకు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఈ పోస్టుల్లో చేరినవారు లెవెల్-3 మూల వేతనం రూ.21,700తోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్ పే పొందవచ్చు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. అందువల్ల మొదటి నెల నుంచే రూ.35 వేలకు పైగా వేతనం లభిస్తుంది. భవిష్యత్తులో వీరు దశలవారీ సిపాయ్, నాయక్, హవల్దార్, నయీబ్ సుబేదార్, సుబేదార్, సుబేదార్ మేజర్ హోదా వరకు చేరుకోవచ్చు. 15 ఏళ్ల సేవలతో జీవితాంతం పూర్తి పింఛను పొందవచ్చు.
ఎవరికంటే...
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందినవారితోపాటు యానాం పరిధిలోనివారు ఇందులో పాల్గొనవచ్చు. ఇతర ప్రాంతాలవారికి అవకాశం లేదు. ప్రస్తుతం వీటికోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివరాలు ‘జాయిన్ ఇండియన్ ఆర్మీ’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు ర్యాలీలో ఎప్పుడు పాల్గొనాలి, అవసరమైన పత్రాల వివరాలు అందులో పేర్కొంటారు. నియామకాల్లో భాగంగా ముందుగా పత్రాలు పరిశీలిస్తారు. అనంతరం దేహదార్ఢ్య, శారీరక కొలతల పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు ఉంటాయి. క్రీడల్లో ప్రతిభావంతులకు కొన్ని సడలింపులు వర్తిస్తాయి.
ఇవీ పోస్టులు(Army recruitment rally)
సోల్జర్ ట్రేడ్స్‌మన్
ఈ విభాగంలో కొన్ని ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి విద్యార్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. హౌస్ కీపర్, మెస్ కీపర్, గుర్రాల పర్యవేక్షణ పోస్టులు ఈ విద్యార్హతతో లభిస్తాయి. ట్రేడ్స్‌మన్ విభాగంలో పదో తరగతి విద్యార్హతతో..చెఫ్, వాషర్ మెన్, డ్రెస్సర్, స్టివార్డ్, టైలర్, ఆర్టిజన్ (వడ్రంగి/ ఇస్త్రీ/ తాపీపని) మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అన్ని పోస్టులకు వయసు 17 1/2 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తు, దానికి తగ్గ బరువు తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం 76 సెం.మీ. ఉండాలి.
సోల్జర్ జనరల్ డ్యూటీ
పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే చాలు, సోల్జర్ జనరల్ డ్యూటీకి అర్హత లభించినట్టే. వయసు 17 1/2 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. 166 సెం.మీ. ఎత్తుతోపాటు సరిపడే బరువు ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం 77 సెం.మీ. ఉండాలి.