శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే నెల మూడో తేదీతో పూర్తి కానుంది. మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌తో పాటు చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్ ఉన్నారు. సాధారణంగా పదవీకాలం పూర్తయ్యే లోపు ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ కొవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ఇప్పట్లో నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో జూన్ మూడో తేదీలోగా ఆ స్థానాలు భర్తీ కావు. ప్రస్తుత సభ్యుల పదవీకాలం పూర్తయ్యాక ఆరుస్థానాలు ఖాళీగా ఉంటాయి. దీంతో మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ సభ్యత్వాలు కూడా పూర్తై రెండు పదవులు ఖాళీ అవుతాయి.
రాజ్యాంగంలోని 184వ ఆర్టికల్ ప్రకారం శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీ అయితే ప్రొటెం ఛైర్మన్‌ను నియమించాల్సి ఉంటుంది. 2011లో ఇదే తరహా సందర్భం వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న మహ్మద్ జానీ పదవీకాలం పూర్తి కావడంతో రెండు పదవులూ ఖాళీ అయ్యాయి. దీంతో అప్పట్లో సీనియర్ ఎమ్మెల్సీ అయిన సింగం బసవపున్నయ్యను ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు. ప్రొటెం ఛైర్మన్‌గా రాజ్‌భవన్‌లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. అదే తరహాలో జూన్ మూడో తేదీ తర్వాత ఇప్పుడు కూడా శాసనమండలికి ప్రొటెం ఛైర్మన్‌ను నియమించాల్సి ఉంటుంది.