AP Skill Development Case :తెలుగుదేశం అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎన్నాళ్లుగానో ఉత్కంఠ రేపుతున్న సెక్షన్ 17ఏ వ్యవహారం నేడు తేలనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చెల్లదని, దాన్ని కొట్టేయాలని చంద్రబాబు న్యాయపోరాటానికి దిగారు. అయితే క్వాష్ పిటిషన్‌ను గతేడాది సెప్టెంబరు 22న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తోసిపుచ్చింది. చంద్రబాబు ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
సుప్రీంలో అనేక మలుపులు తిరిగిన చంద్రబాబు పిటిషన్ గతేడాది అక్టోబరు 3కు తొలిసారి జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ తర్వాత అనేక దఫాలు వాయిదాల పడింది. అక్టోబర్ 13న స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్‌తో పాటు, ఫైబర్‌గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌నూ ఇదే ధర్మాసనం విచారించింది. రెండు కేసుల విచారణను అక్టోబరు 17కి వాయిదా వేసింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చింది.
Supreme Court Verdict On AP Skill Development Case :ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు 17-ఏపై నిర్ణయాన్ని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించనుంది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్, స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. ఈ రెండు కేసుల విచారణ కూడా సెక్షన్-17ఏతో ముడిపడి ఉండడంతో వాటికన్నా ముందే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరగడం కూడా తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ పోటాపోటీ వాదనలు వినిపించారు. అనినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17ఏ నిబంధనలను అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం చెల్లదన్నది చంద్రబాబు న్యాయవాదుల వాదన. 2018 జులై 26 నుంచి సెక్షన్ 17ఏ అమల్లో ఉందని, 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేసి, 2023 సెప్టెంబర్ 8న చంద్రబాబును నిందితుడిగా చేర్చారని కోర్టుకు తెలిపారు.
Supreme Court Judgment on Skill Development Case :కానీ ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం నేర ఘటన 2018కి పూర్వం చోటు చేసుకుందని, సెక్షన్ 17ఏ పాటించాల్సిన అవసరం లేదని వాదించింది. అయితే 17ఏ అమల్లోకి వచ్చాక పబ్లిక్ సర్వెంట్‌పై కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు చేయాలన్నా కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తెచ్చారు. ఓ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ సర్వెంట్లు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా, మరో ప్రభుత్వం వారిపై కక్ష సాధించకుండా రక్షణ కల్పించేందుకే సెక్షన్ 17ఏని తెచ్చారని గుర్తుచేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పూర్తిగా చట్టవిరుద్ధమని వాదించారు.
స్కిల్ కేసులో చంద్రబాబుపై ప్రాథమిక ఆధారాల్లేవని, ప్రాథమిక ఆధారాల్లేకుండా ఏ వ్యక్తినైనా అరెస్టు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని, అర్నబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చంద్రబాబు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సెక్షన్ 17ఏ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ ఛత్రం కారాదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బంది పడకూడదనే 17ఏ తెచ్చారని పేర్కొన్నారు.
అయితే ఈ కేసంతా కక్షపూరితమేనని, చంద్రబాబు తరపు న్యాయవాదులు తేల్చిచెప్పారు. స్కిల్ కేసు ఎఫ్ఐఆర్లో మొదట చంద్రబాబు పేరులేదని, రిమాండ్ సమయంలోనే ఆయన పేరు చేర్చారని గుర్తుచేశారు. ఈ కేసులో చాలా మంది అధికారులను విచారించామని చెప్పిన సీఐడీ ఒక్కరికీ 17ఏ నిబంధన కింద అనుమతి తీసుకోలేదన్నారు. నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. న్యాయ సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 17ఏను అనుసరించి చంద్రబాబుపై స్కిల్ కేసు కొట్టేస్తుందా? లేదంటే చంద్రబాబు పిటిషన్‌నే కొట్టేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.