తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరంపై ఉమ్మడి సర్వే.. తెలంగాణ విజ్ఞప్తికి అంగీకరించిన ఏపీ - POLAVARAM SURVEY

POLAVARAM SURVEY : పోలవరం ప్రాజెక్టు ముంపు అంశంపై ఉమ్మడి సర్వేకు.. ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించినట్లు కేంద్ర జలసంఘం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరిలో ప్రభావిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించిన జలసంఘం.. ఆ భేటీ మినిట్స్‌ను విడుదల చేసింది. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు సంయుక్త సర్వేకు అంగీకరించినట్లు జలసంఘం స్పష్టంచేసింది.

polavaram
పోలవరం

By

Published : Feb 11, 2023, 10:16 AM IST

పోలవరంపై ఉమ్మడి సర్వే

POLAVARAM SURVEY : పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టంతో ఉత్పన్నమయ్యే ప్రభావాలపై.. ఉమ్మడి సర్వే చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ అంగీకారం తెలిపిందని.. కేంద్ర జలసంఘం వెల్లడించింది. సర్వే ఫలితాల ఆధారంగా.. అవసరమైన చర్యలను పోలవరం ప్రాజెక్టు అథార్టీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొంటాయని..పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రభావానికి గురయ్యే రాష్ట్రాలతో.. కేంద్ర జలసంఘం జనవరి 25న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో పాటు పోలవరం అథార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలిపింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు.. వచ్చిన అభిప్రాయాలతో కూడిన మినిట్స్‌ను జలసంఘం రాష్ట్రాలకు పంపింది. ‘‘ఒడిశా లేవనెత్తిన అంశాలకు జలసంఘం వివరంగా సమాధానం ఇచ్చింది. సంబంధిత రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు గరిష్ఠ వరద ప్రవాహంపై మళ్లీ అధ్యయనం చేయిస్తామని.. జలసంఘం ఛైర్మన్‌ ఓహ్రా తెలిపారు.

ఎక్కువ విస్తీర్ణంలో ముంపునకు గురయ్యే భూమి విషయంలో.. కరకట్ట నిర్మాణమా లేక భూమికి పరిహారమా అనేది.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ చెప్పాలని ఓహ్రా కోరారు. తమకున్న ఆందోళనలను తెలంగాణ లేవనెత్తి పరిష్కరించుకొందని.. ఒడిశా కూడా ఇదే రకంగా వ్యవహరించాలని.. జలసంఘం ఛైర్మన్‌ సూచించారు. తాను చేసిన సూచనకు తెలంగాణ అంగీకరించిందని.. ఆరు పెద్ద వాగులపై సంయుక్త సర్వేను కేంద్ర జలసంఘం చేపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులు దీనికి అంగీకరించి తదుపరి కార్యాచరణకు సంబంధించి తమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లు.. ఓహ్రా పేర్కొన్నారు.

పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టమైన 150 అడుగులకు నింపినపుడు తెలంగాణలో ముంపు, బ్యాక్‌వాటర్‌ ప్రభావం, తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ, స్థానిక వాగుల్లో నీరు నిల్వ ఉండటం వల్ల డ్రైనేజీ సమస్య, మణుగూరు హెవీ ప్లాంట్‌పై ప్రభావం.. తదితర అంశాలను తెలంగాణ ప్రస్తావించింది. ఎగువ రాష్ట్రాలకు నిజమైన సమస్యలు ఏమైనా ఉంటే.. పరిగణనలోకి తీసుకొంటామని, పోలవరం ప్రాజెక్ట్‌ వేగంగా పూర్తి చేయడానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కోరారు.

కిన్నెరసాని, పోలవరంలో 150 అడుగులకు నీటిని నింపినపుడు ముంపునకు సంబంధించి.. గతంలో పాతిన రాళ్ల నుంచి సంయుక్త పరిశీలనను.. ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ ప్రతిపాదించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా అభిప్రాయాలను విన్న తర్వాత సంయుక్త సర్వేకు సమ్మతిని తెలియజేసినట్లు.. కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ పేర్కొన్నారని.. మినిట్స్‌లో వివరించారు. ఈనెల 15న సుప్రీంకోర్టులో ఈ అంశంపై మళ్లీ విచారణ జరగనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details