దేశవ్యాప్తంగా కొవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారిలో యాంటీబాడీల స్థాయి పరీక్షించేందుకు డీఆర్డీవో (Drdo) రూపొందించిన పరీక్ష కిట్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డీఆర్డీవో (Drdo) ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి (Sathish reddy) వెల్లడించారు. దిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ‘డిప్కోవాన్’ పేరిట డీఆర్డీవో రూపొందించిన ఈ కిట్ కేవలం రూ.75కే అందుబాటులో ఉంటుందని, మనిషి శరీరంలో యాంటీబాడీలు ఏమేరకు ఉన్నాయో కచ్చితమైన ఫలితాన్నిస్తుందని పేర్కొన్నారు.
2డీజీ డ్రగ్ కూడా సమర్థంగా పనిచేస్తున్నట్లు ఫలితాలొస్తున్నాయని, వారంలోగా హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ద్వారా 6 నుంచి 8 లక్షల 2డీజీ పొట్లాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరిన్ని సంస్థల ద్వారా ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నుంచే ముడి పదార్థాన్ని మరికొన్ని సంస్థలకు ఇచ్చి ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇంకో వారంలో దానిపై స్పష్టత వస్తుందన్నారు.
స్వల్ప లక్షణాలున్న వారికీ..
2డీజీ డ్రగ్ (2DG drug)ఇతర దేశాల బయోవార్‌ని డీఆర్డీవో (Drdo) ముందే ఊహించి తయారు చేసినట్లు జరుగుతున్న ప్రచారం సరికాదని డాక్టర్ సతీష్‌రెడ్డి (Sathish reddy) అన్నారు. సైనికులపై రేడియేషన్ ప్రభావం పడకుండా ఉండేందుకు పదేళ్లుగా ప్రయోగాలు చేసి దీన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. కొవిడ్ నియంత్రణలోనూ ఇది పనిచేస్తుందని నమ్మి దేశవ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో దీన్ని ప్రయోగించి, మంచి ఫలితాలొచ్చాకే అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.