AP EMPLOYEES JAC: చల్లారిందని భావించిన ఉద్యోగ సంఘాల ఆందోళన.. ఒక్కసారిగా ఎగసిపడింది. ఏపీ ముఖ్యమంత్రి భేటీతో అంతా సామరస్యమే అనుకున్న తరుణంలో.. సమరమే అని నినదించారు నేతలు. పీఆర్సీ, డీఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వం తమను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ పీఆర్సీ, జీవోలు తమకు వద్దే వద్దని, న్యాయం చేయకపోతే.. సమ్మెకైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు. రేపు, ఎల్లుండి నిర్వహించే సమావేశాల్లో.. నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇంకా నేతలు ఏమన్నారంటే..
రాష్ట్ర చరిత్రలోనే లేదు: బండి శ్రీనివాసరావు
ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే లేవని బండి శ్రీనివాసరావు అన్నారు. తక్కువగా ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను ఐకాసలు వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. జీవోలన్నింటినీ తిరస్కరిస్తున్నామన్న ఆయన.. ఈ పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని కుండ బద్ధలు కొట్టారు. పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ ఇస్తామనడంపైనా మండి పడ్డారు. అలాంటి పద్ధతి అవసరం లేదన్నారు. పాత పద్ధతిలోనే పీఆర్సీ ఇచ్చేదాకా పోరాడతామని చెప్పారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏలో కోతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న బండి.. దుర్మార్గమైన ప్రభుత్వ ఎత్తుగడను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్న బండి శ్రీనివాసరావు.. అవసరమైతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
ఇది చీకటిరోజు: బొప్పరాజు