Amrit Bharat Station Scheme in Telangana : రాష్ట్రంలోని 21 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ కింద రాష్ట్రంలో రూ.898 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట, ఉప్పుగూడ, మలక్‌పేట, మల్కాజిగిరి, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్డు, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, తాండూరు, రామగుండం, రాయగిరి(యాదాద్రి) రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందనున్నాయి.
Kishanreddy Comments at Nampally Amrit Bharat Station Programme : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 రైల్వేస్టేషన్లలో పునరాభివృద్ధి పనులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిరైల్వే స్టేషన్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో ఇండియన్ రైల్ అభివృద్ధి చెందిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయన్న ఆయన.. 2014 నుంచి 2023 వరకు రైల్వే శాఖ బడ్జెట్ 17 రెట్లు పెరిగిందన్నారు. హైదరాబాద్ నుంచి యాద్రాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను రూ.3 వందల కోట్లతో నిర్మించబోతున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆయన విమర్శించారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం కోసం కేంద్రానికి.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని ఆరోపించారు.
'2 వేల కి.మీ.కు పైగా రైల్వేలైన్స్ కోసం రాష్ట్రంలో సర్వే చేశాం. రూ.300 కోట్లతో హైదరాబాద్ నుంచి యాద్రాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులోకి తెస్తాం. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు ఇచ్చాం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 2024లోపు పూర్తి చేస్తాం. రూ.300 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తాం. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం కోసం భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి తెలంగాణ సర్కార్ సహకరించట్లేదు. నిధులు ఇస్తామన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేయడం లేదు.'-కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు