Errabelli Dayakar respond on Bathukamma sarees: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి అక్కచెల్లమ్మలకు ఒక అన్నగా, తమ్ముడుగా ఎంతో ప్రేమతో బతుకమ్మ చీరలు ఇస్తున్నారని దానిని కొందరు రాజకీయం చేసి వాటిని కాల్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది చాలా బాధకరమైన విషయని పంచాయితీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. బతుకమ్మ చీరలను ఎవరైనా కాలబెడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆయన ఆదేశించారు. బతుకమ్మ చీరలు బహుమతిగా ఇస్తున్నామని వాటిని ధరతో పోల్చకూడదని ఆయన సూచించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దసరా, బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, మిగతా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ చీరలు నచ్చితే తీసుకోవాలి లేకుంటే వదిలివేయాలని అంతే గాని లేనిపోని రాజకీయం చేయడం తగదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, వరంగల్ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు.