విశాఖపట్టణం సమీపంలోని గంగవరం పోర్టు ఏపీలో రెండో అతిపెద్ద నాన్-మేజర్ పోర్టు. దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్లో అయినా సరకు రవాణా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. బాగా లోతైన పోర్టు అయినందున 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్ కేప్ సైజ్ ఓడలూ ఈ పోర్టుకు వచ్చి పోగలవు. 18వందల ఎకరాల్లో ఉన్న ఈ పోర్టులో 9 బెర్తులు ఉన్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, పంచదార, అల్యూమినియం రవాణా పెద్దఎత్తున సాగుతోంది. తూర్పు, పడమర, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరకు రవాణా సాగుతోంది. ఈ పోర్టు సామర్థ్యాన్ని 31 బెర్తులతో, ఏటా 25 కోట్ల టన్నుల సరకు రవాణా చేయగలిగేలా విస్తరించేందుకు మాస్టర్‌ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది. 2019-20లో 3.45 కోట్ల టన్నుల సరకు రవాణాతో 1,082 కోట్ల ఆదాయాన్ని గంగవరం పోర్ట్ కంపెనీ నమోదు చేసింది. వడ్డీ, పన్నులు, రుణ విమోచనకు ముందు ఆదాయం రూ.634 కోట్లుగా ఉంది. నికరలాభం 516 కోట్లు. కంపెనీకి అప్పు లేకపోగా, 500 కోట్ల రూపాయల నగదు నిల్వ ఉంది.
కృష్ణపట్నంతో పాటు...
ఏపీలోని కృష్ణపట్నం పోర్టును కొంతకాలం క్రితమే అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజడ్ సొంతం చేసుకొంది. ఇప్పుడు గంగవరం పోర్టునూ దక్కించుకోనున్నందున దేశానికి తూర్పు తీరంలో, అదానీ పోర్ట్స్ క్రియాశీల సంస్థగా ఆవిర్భవించనుంది. దేశవ్యాప్తంగా 12 ప్రదేశాల్లో అదానీ పోర్ట్స్‌కు నౌకాశ్రయాలు ఉండగా... సంస్థ మార్కెట్ వాటా 30 శాతానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. తాము అభివృద్ధి చేయాలనుకుంటున్న కార్గో టెర్మినల్స్‌కు గంగవరం పోర్టు ఎంతో అనుకూలమని అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ తెలిపారు.