తెలంగాణ

telangana

ETV Bharat / state

engili pula bathukamma 2021: సింగిడిలోని రంగులు.. తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ.. అచ్చమైన ప్రకృతి పండుగ - తెలంగాణ వార్తలు

వానాకాలం ప్రారంభమై అప్పటిదాకా కురిసిన వర్షాలతో చెరువులు, వాగులూ వంకలు నిండుకుండలా మారుతాయి. వరణుడి కరుణతో చెట్లు, కొమ్మలు పులకరించి పూలతో పలకరిస్తాయి. సరిగ్గా ఇదే సమయానికి తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ పండుగ వస్తుంది. పూలు బాగా వికసించి... జల వనరులు పొంగిపొర్లే సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. మహాలయ అమావాస్యతో(mahalaya amavasya 2021) ఈ ఉత్సవాలు మొదలవుతాయి. పిల్లాపెద్దా తేడా లేకుండా ఆడుతారు. బతుకమ్మ పండుగ పేరు వింటే చాలు ఆడబిడ్డల మనసు ఎగిరి పుట్టినింట వాలుతుంది. అందుకే బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డ తన పుట్టింటికి పోవాలని ఆరాటపడుతుంది. కన్నవారు, తోబుట్టువులు, చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందోత్సహాల నడుమ ఈ ప్రకృతి పండుగను జరుపుకుంటుంది. సింగిడిలోని రంగుల కలబోతగా తీరొక్క పూలతో పేర్చి... పసుపు, కుంకుమలతో ఆ గౌరమ్మ తల్లిని కొలుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ(engili pula bathukamma 2021) సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...

engili pula bathukamma 2021, telangana bathukamma
ఎంగిలిపూల బతుకమ్మ 2021, తెలంగాణ బతుకమ్మ సంబురం

By

Published : Oct 5, 2021, 6:37 PM IST

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే పండుగ బతుకమ్మ(bathukamma festival 2021). ప్రకృతి ఆరాధనకు, ప్రాణికోటి మనుగడకు నెలవైన మట్టి మనుషుల పండుగ. మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు ఊరు, వాడలు పూల వనాలుగా మారి పులకరించనున్నాయి. తీరొక్క పూలతో సింగిడిలోని రంగుల కలబోతగా ఆడబిడ్డలు బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చుతారు. ప్రకృతిని ఆరాధించే అచ్చమైన పల్లెపండుగ ఇది. అందుకే ప్రకృతి ఒడిలో నుంచి వికసించిన తీరొక్క పూలతో తయారుచేస్తారు. పూలు, పసుపు, కుంకుమలతో ఆ గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్యతో ఈ పూల పండుగ ప్రారంభమవుతుంది. దీనినే పెత్రమాస, ఎంగిలిపూల బతుకమ్మ(engili pula bathukamma 2021), మహాలయ అమావాస్య అంటారు. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరిట ఆ గౌరమ్మను సాగనంపుతారు.

తీరొక్క పూలతో బతుకమ్మ

పెత్రమాస అంటే..

పెత్రమాసనాడు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఇవాళ పెద్దలకు బియ్యం ఇస్తారు. ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. ఇంట్లోని పురుషులు వేకువ జామునే నిద్రలేచి... చేతిసంచి తీసుకొని పూలవేట కోసం పరిగెడతారు. పూలు సేకరించడానికి పిల్లలూ పెద్దలతో కలిసి పచ్చికబయళ్లకు వెళ్తారు. చేలు, అడవుల్లో ఉండే పూలను కోసుకొని తీసుకొస్తారు. వాటితో పాటు ఇంట్లో పెంచిన పూలను కలిపి బతుకమ్మను పేర్చుతారు. ఈ సమయంలో ప్రతి చెట్టు ఆ గౌరమ్మ సిగలో వాలడానికే వికసించినట్లుగా పూలతో పలకరిస్తాయి. తంగేడు, గునుగు, టేకు, చేమంతి, బంతి, తామర, కలువ, కట్ల పూలు, నందివర్ధనం ఇలా తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. మొదటిరోజు నువ్వులు, బెల్లం, నూకలతో నైవేద్యం తయారు చేస్తారు.

వెంపలి చెట్టుకు పూజలు

బతుకమ్మ పేర్చడం

వేకువజామునే నిద్రలేచిన మహిళలు... పిండి వంటలు ప్రారంభిస్తారు. ఇంటిళ్లిపాది ఉదయాన్నే తలస్నానాలు చేసి... నూతన వస్త్రాలు ధరిస్తారు. అలా ఇంట్లోని ఓ ప్రదేశంలో చాప పరుస్తారు. పచ్చికబయళ్ల నుంచి తీసుకొచ్చిన పూలతో బతుకమ్మను పేర్చుతారు. నచ్చిన సైజులో వలయాకారంలో ఉన్న తాంబాలం లేదా ప్లేట్లను తీసుకుంటారు. అందులో ఓ ఆకు పరిచి... పసుపు పచ్చని తంగేడు, తెల్లని గునుగు మొదలు తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. రంగులు మార్చుతూ... వలయాకారంలో వివిధ వర్ణాల్లో తీర్చిదిద్దుతారు. మధ్యలో పూల రేకలు, ఆకులు వంటివి నింపుతూ అందంగా పేరుస్తారు. అనంతరం పూజ గదిలో భద్రంగా ఉంచి... పసుపుతో గౌరమ్మను తయారు చేస్తారు. అగరుబత్తిలు వెలిగిస్తారు. చిన్నపిల్లలకు సైతం తమకూ బతుకమ్మ కావాలని ఆర్డర్ వేస్తారు. చిన్నపిల్లలు, యువతులు, మహిళలు ఇలా అందరూ బతుకమ్మ ఎత్తుకోవాలనే ఆశపడుతారు.

బతుకమ్మ జోరు

బతుకమ్మ జోరు

మహిళలంతా భక్తిశ్రద్ధలతో అందంగా ఆ బతుకమ్మను పేర్చే సమయానికల్లా సాయంత్రం కానే వస్తుంది. బతుకమ్మను పేర్చి... ఇక పిల్లాపెద్దలు ఇనుప సందుగల్లో ఉన్న పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరిస్తారు. ఆడబిడ్డలంతా చల్లటి సాయంత్రం వేళ తీరొక్క పూలతో పేర్చిన ఆ బతుకమ్మను పట్టుకొని... దేవాలయ ప్రాంగణం లేదా చెరువువైపు గానీ, తటాకంవైపుగానీ బయల్దేరుతారు. సింగిడిలోని రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఊరేగింపుగా వస్తున్న ఆ ఆడబిడ్డలను చూస్తే రెండు కళ్లు సరిపోవు. ఈ అద్భత దశ్యాన్ని చూడడం కోసం పండు ముసలమ్మ సైతం వీధుల్లోకి వచ్చి నిలబడతారంటే అతిశయోక్తి కాదు. భూదేవీ పులకించేలా ఈ బతుకమ్మల జోరు ఉంటుంది. రంగురంగుల పూలు... అగరుబత్తుల వాసనలు... ఆడబిడ్డల పట్టు చీరల మెరుపులు... ఆభరణాల ధగధగలు.. అచ్చమైన ఈ పల్లెపండుగ తెలంగాణ అస్తిత్వానికే ప్రతీక.

కోలాటాల కోలాహలం

కోలాటాల కోలాహలం

విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసువుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు, బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. పిల్లాపెద్దా కలిసి ఐక్యతా, సోదరభావం, ప్రేమానురాగాలతో జరుపుకుంటారు. ఈ క్రమంలో వరుసైనవాళ్లు కాసేపు ఆటలాడుకుంటారు.

అచ్చమైన పల్లె పండుగ

గంగమ్మ ఒడికి..

అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డలు పుట్టిన ఊరిలోని తమ చిన్ననాటి మిత్రులతో కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ప్రస్తుతం డీజే పాటలతో బతుకమ్మల వద్ద అందరూ సందడి చేస్తున్నారు. అనంతరం పురుషులు వచ్చి ఆ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. పోయిరా గౌరమ్మా... పోయిరావమ్మా.. అంటూ సాగనంపుతారు. అనంతరం తమతో తీసుకొచ్చిన నైవేద్యాన్ని ఆ గౌరమ్మకు సమర్పించి... ఒకరికొకరు పంచుకుంటారు. ఖాళీ తాంబాలంతో పాటలు పాడుతూ ఇళ్లకు చేరుతారు. దాదాపు అర్ధరాత్రి వరకు ఇలా పాటలు పాడుతూ... కోలాటాలు చేస్తారు. పెత్రమాస, సద్దుల బతుకమ్మ నాడు ఆడబిడ్డలంతా కోలాహలంగా ఈ పండగను జరుపుకుంటారు. మిగతా రోజుల్లో పిల్లలు సరదాగా వీధుల్లో కోలాటాలు చేస్తారు.

బతుకమ్మ సంబురం

మహిళలే మహారాణులు

ఆరోగ్యం, ఐకమత్యం, భగవతారాదనతో కూడిన బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులపాటు జరుపుకునే పూల పండుగ. ఏటా తొమ్మిది రోజులపాటు తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో పండుగ సందడి ఉంటుంది. పిండి వంటల ఘుమఘుమలు... పుట్టినింట్లో ఆడబిడ్డల చిరునవ్వులు, బంధుమిత్రుల కోలాహలం.. పిల్లపాపలతో ఇళ్లు కళకళలాడుతాయి. చదువులు, ఉద్యోగాల పేరిట దూరంగా ఉంటున్న పిల్లలు సొంతగూటికి చేరుతారు. అత్తారింట్లో ఉండే మహిళలూ పిల్లాపాపలతో పుట్టింటికి చేరుతారు. మెట్టినింట్లో ఎన్నో కట్టుబాట్ల నడుమ ఉండే మహిళ అయినా... సరే బతుకమ్మ పండుగ నాడు చిన్ననాటి స్నేహితులతో చప్పట్లు, కోలాటాలతో పసిపిల్లల్లాగా మారిపోతుంది. తమ బిడ్డల కళ్లలో ఆ పసితనం చూడడం కోసమే ఈ పండుగ కోసం తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. ఇదే బతుకమ్మ పండుగ. అచ్చమైన పల్లెపండుగ. ప్రకృతి పండుగ. అద్భుతమైన సంప్రదాయం. ఈ పండుగలో మహిళలే మహారాణులు. వారిదే హడావిడి అంతా! అందుకే మరి... ఏటా వచ్చే ఈ పండుగ ప్రతిఆడబిడ్డకు అపురూపమే. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఈటీవీ భారత్ తరఫున ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

ఇదీ చదవండి:అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

ABOUT THE AUTHOR

...view details