తొందరగా బ్రష్ చేస్కో కన్నా.. స్కూల్కు వెళ్లాలి. అరేయ్ నాన్న ఈ ఒక్క ముద్ద తినరా... మా బాబు కదూ.. మా బుజ్జి కదూ. ఇవండీ... పిల్లలను తల్లిదండ్రులు సముదాయించే తీరు. మొండిఘటం, పెంకితనానికి ఏ మాత్రం కొదవుండదు. ముద్దు ముద్దు మాటలతో చుట్టూ తిరిగే బుజ్జాయిల అల్లరి అంతా ఇంతా కాదు. పొరపాటున చరవాణో, టీవీ రిమోటో చేతిలోంచి లాక్కున్నామంటే అంతే సంగతులు రాగం అందుకున్నారంటే మళ్లీ ఆపేందుకు అరగంటైనా పడుతుంది. వారి ఏడుపు ఆపేందుకు తల్లిదండ్రులు పడరాని పాట్లు పడాలి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాంతాండంత లిస్ట్ ఉంటుంది వారి చిలిపి పనుల చిట్టా. పిల్లలకు సరదా.... పెద్దలకు పరీక్ష అన్నట్టుగా తయారైంది చిచ్చర పిడుగుల అల్లరి.
ఇవీ చూడండి: బంగ్లాదేశ్ మార్కెట్.... ఇక్కడ అన్ని చవకే!
కౌన్సిలింగ్ సెంటర్లకు పరుగులు:
పిల్లలకుఅల్లరిఅందం. చిన్నారులు చేసే చిలిపి పనులను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. అది ఇప్పుడు శృతి మించుతోంది. నచ్చిన పనులు చేయకపోయినా... అడిగింది ఇవ్వకపోయినా... పిల్లలు చేస్తున్న గొడవ అంతా ఇంతా కాదు. కింద పడి దొర్లడం, చేతిలో ఉన్నవి విసరటం, గుక్కతిప్పుకోకుండా ఏడవటం వంటి అస్త్రాలు సంధిస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుని కౌన్సిలింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు తల్లిదండ్రులు.