రాష్ట్రంలో అలముకుంటున్న కరవు ఛాయలు వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరవుఛాయలు అలముకుంటున్నాయి. మొత్తం 433 మండలాల్లో వర్షాభావం తీవ్రస్థాయికి చేరింది. నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. కారుమబ్బులు లేనందున సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నేటి నుంచి మరో 2 రోజులు తేలికపాటి వర్షాలే కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ పరిస్థితుల్లో రైతులు తక్కువ కాలంలో పండే వంగడాలను ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
60శాతం మించితే కరవే
యాదాద్రి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క మండలంలోనైనా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. జూన్ ఒకటి నుంచి నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 232.7 మిల్లీమీటర్లకు 152.2 మిల్లీ మీటర్లే కురిసింది. జూన్‌లో వర్షపాతం లోటు 33 శాతముంటే ఈ నెలలో 35కి పెరిగింది. కొన్ని మండలాల్లో వర్షపాతంలోటు 90 శాతానికిపైగా ఉంది. లోటు 60 శాతానికి మించితే కరవు ఉన్నట్లుగా భావిస్తారు. ఇప్పటికే 40 లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో వేసిన పైర్లు నీరు అందక వాడిపోతున్నాయి. మరో వారం, పది రోజులు వర్షాలు లేకపోతే పంటలు చాలా వరకూ ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రధాన పంటల సాగు వద్దు
రాష్ట్రంలో తొలకరి వర్షాలు పడగానే రైతులు విత్తనాలు వేయడం ఆనవాయితీ. కానీ జులై మూడో వారం వచ్చినా వానలు లేకపోవడం వల్ల పలు పంటల సాగుకాలం తీరిపోయింది. మినుము, పెసర, వేరుశెనగ, సోయాచిక్కుడు వంటి ప్రధాన పంటలను ఈ ఖరీఫ్‌లో సాగుచేయవద్దని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచిస్తోంది. వరిలోనూ తక్కువకాలంలో పండే వంగడాలకే నారు పోయాలన్నారు. ఈ నెలాఖరు వరకూ వర్షాలు లేకపోతే ఆగస్టులో నారు, నాట్లజోలికి వెళ్లకుండా నేరుగా వరి విత్తనాలను చల్లే సాగు పద్ధతి అనుసరించాలని చెప్పారు. పత్తిలోనూ తక్కువ కాలంలో పండే విత్తనాలనే నాటాలని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయండి
కరవు పరిస్థితుల వల్ల పంటల సాగు అంతంతమాత్రంగా ఉంది. పత్తి పంట బీమా ప్రీమియం చెల్లింపు గడువు సోమవారంతో ముగియడం వల్ల.. ఈనెల 23 వరకు పొడిగించాలని కేంద్రానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి లేఖ రాశారు. పొద్దుతిరుగుడు, ఆముదం, జొన్న వంటి పంటల సాగువైపు రైతులను మళ్లించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రాయితీపై ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఇంటర్ మృతుల కుటుంబాలకు అఖిలపక్షం సాయం