భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వరద ప్రవాహం వేగం అంతకంతకూ పెరగడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సోమవారం ఉదయం 48 అడుగుల నీటిమట్టానికి చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. ఇవాళ సాయంత్రానికి 53 అడుగులు దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం ఒడ్డున మాతా మండపం వరకు వరద నీరు చేరింది. స్నానఘట్టాలు మునిగి పోయాయి. కల్యాణ కట్ట కిందకు వరద నీరు చేరింది.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు:మూడోప్రమాద హెచ్చరిక జారీ కావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08743232244 నెంబర్ అందుబాటులో ఉంచారు. లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు. పట్టణంలోని అయ్యప్ప కాలనీకి ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆరు కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. భద్రాచలం పట్టణంలోని విస్తా కాంప్లెక్స్ వద్ద వర్షపునీటిని తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేసినప్పటికీ బ్యాక్ వాటర్ సమస్య తప్పలేదు. ఈ నీళ్లు నదిలో కలిసే మార్గం లేకపోవడం వల్ల అన్నదానం సత్రం ముందు భారీగా వరదనీరు చేరింది. ఫలితంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు.
నిలిచిపోయిన రాకపోకలు:మరోవైపు భారీ వరదల ప్రభావం గోదావరి తీర ప్రాంతాలపైనా పడుతోంది. సారపాక-రెడ్డిపాలం మధ్య రహదారిపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే మార్గంలో పలుచోట్ల రహదారులపైకి వరద నీరు రావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు మునిగిపోయాయి. తాలిపేరు జలాశయం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తోతట్టు గ్రామాలను అప్రమత్తం చేశారు. దండుపేట గ్రామంలోని సుమారు 100 కుటుంబాలను రాళ్లగూడెంలో ఏర్పాటు చేసిన పునరావాసకేంద్రానికి తరలించారు. భారీ వరదలతో చర్ల మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన సుమారు 5 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి, గంగోలులో సుమారు 70 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పర్ణశాల వరద గుప్పిట్లో చిక్కుకుంది.
మంత్రి పువ్వాడ సమీక్ష:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర అధికారులతో కలిసి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో వర్షాలు, వరద తీవ్రతపై సమీక్ష నిర్వహించారు. విపత్కర పరిస్థితులు వచ్చినా అధికారులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: