స్టిక్స్ సహాయంతో ఒకరు... వడివడిగా నడుచుకుంటూ వస్తోంది మరొకరు కాదు... ఇద్దరూ ఒక్కరే. నిజమా అని ఆశ్చర్యంగా ఉంది కదూ... కానీ గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే కఠోర నిజమిది. పీహెచ్డీ సాధించిన ఈమె పేరు గుణస్వేత. ఆమె జీవితమేమీ సునాయసంగా సాగలేదు. అన్నీ కష్టాలే.
ఇంటర్‌లోనే క్యాన్సర్
ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉండే కురగంటి గుణస్వేత చదువుతో పాటు బాస్కెట్‌బాల్, క్లాసికల్ నృత్యంలో తనకు తానే సాటి. వైద్యురాలిగా స్థిరపడాలనేది ఆమె కోరిక. ఆమె పాఠశాల విద్యంతా ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాగింది. 2005-06లో పదోతరగతి పరీక్షలకు వెళ్లిన తొలిరోజే ఆమె కుడి కాలికి బలమైన దెబ్బతగిలింది. తొలుత ఆ దెబ్బను పెద్దగా పట్టించుకోలేదు. పదోతరగతిలో ప్రథమశ్రేణిలో పాసైంది. గుంటూరులో ఇంటర్ చదివే సమయంలో కాలికి ప్రారంభమైన నొప్పి తీవ్రస్థాయికి చేరింది. స్థానిక వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో బయాప్సి పరీక్ష చేయించగా... క్యాన్సర్ నాలుగో స్టేజికి చేరిందనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది.
ఒంటికాలితోనే జీవిత పయనం
హైదరాబాద్ నుంచి అదే ఏడాది చెన్నైలోని అడయార్ క్యాన్సర్ పరిశోధనా కేంద్రంలో చూపించగా.. ఆరుసార్లు కీమోథెరపి చేయాలనే వైద్యుల సూచన కుటుంబీకుల ఆశలు ఆవిరయ్యేలా చేసింది. కానీ గుణస్వేత ఎక్కడా కుంగిపోలేదు. మరో మూడుసార్లు కీమోథెరపి చేయకుండా క్యాన్సర్ సోకిన కుడికాలును మొత్తం తీసివేస్తే బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఆ దశలోనే ధైర్యం చేసిన గుణస్వేత తనకాలు తీసివేయాలని వైద్యులను కోరింది. ఆమె అంగీకారంతో 2006 నవంబర్ 21న కాలు తొలిగించారు. బాస్కెట్‌బాల్, క్లాసికల్ నృత్యంలో రాణించాలనే ఆశయం ఆవిరైంది.