Dharani portal: ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సావర్గాం గ్రామస్థులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. స్థానిక ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి కొన్న భూములకు ధరణి పోర్టల్‌లో పట్టాదారు పేరు మారకపోవడంతో అనేక సమస్యలు తలెత్తాయి. ఏళ్ల కిందట ఏర్పడిన ఊరును ఖాళీ చేయలంటూ పట్టాదారు కోర్టును ఆశ్రయించాడు. ఆ భూమి తమదేనంటూ అందుకు ధరణిలో ఉన్న పట్టాపాసుపుస్తకమే సాక్ష్యామంటూ చూపించాడు.
రెవెన్యూ దస్త్రాల్లో గతంలో ఊరు కోసం కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ మార్చకపోవడంతో పట్టాదారుకు అనుకూలంగా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఊరంతా ఖాళీ చేయమని అతడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆందోళన చెందిన గ్రామస్థులు కలెక్టరేట్ ముందు తమకు న్యాయం చేయాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. కలెక్టర్‌ను కలసి తమ గోడును వినిపించారు. పట్టాదారు పట్టాను ధరణి పోర్టల్‌లో కనిపించకుండా రద్దు చేయాలని కలెక్టర్‌ని కోరారు. తమకు భూమిని విక్రయించిన పట్టాదారు చనిపోయారని.. ఆయన వారసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు వెనుదిరిగారు.
గతంలో క్రయవిక్రయాలకు సంబంధించి గ్రామస్థులు రెవెన్యూ దస్త్రాల్లో మార్పులు చేసుకోకపోవడంతో.. ధరణిలో ఇంకా పాత పట్టాదారు పేర్లే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. ధరణి సేవలతో సమస్యలు తీరుతాయనుకుంటే కొత్త సమస్యలు తెరపైకి రావడం ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాశంగా మారింది.