టోక్యో ఒలింపిక్స్ సెమీస్ ఓటమి నుంచి తేరుకొని ఆదివారం కాంస్య పతక పోరులో పీవీ సింధు విజయం సాధిస్తుందని ఆమె తండ్రి రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం సెమీస్‌లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి తైజూ యింగ్ చేతిలో పీవీ సింధు ఓటమిపై ఆమె తండ్రి రమణ స్పందించారు. తైజూ అద్భుత ఆటతీరుతో సింధును ఓడించిందని.. చాలా వ్యూహాత్మకంగా ఎక్కువ ర్యాలీలు లేకుండా జాగ్రత్తపడిందన్నారు. దూకుడుగా ఆడేందుకు సింధుకు అవకాశం లేకుండా పోయిందని.. తొలి గేమ్ ఓటమి తర్వాత రెండో గేమ్‌లో పుంజుకుంటుందని భావించినా.. ఒత్తిడికి గురైనట్లు అనిపించిందని రమణ అన్నారు.
ఎలాంటి వ్యూహాలతో వస్తే ప్రపంచ నెంబర్ వన్ను ఎదుర్కోవచ్చో ఈ మ్యాచ్ ద్వారా తెలిసిందని.. భారత్‌కు పతకం తీసుకొచ్చేలా సింధు తదుపరి మ్యాచ్‌లో ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నామన్నారు రమణ.