తెలంగాణ

telangana

ETV Bharat / sports

రేపటి నుంచే ఆస్ట్రేలియన్​ ఓపెన్​.. ఫేవరెట్​ జకోవిచ్​

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫేవరెట్లుగా పురుషుల విభాగంలో నాదల్​, మహిళల విభాగంలో సెరెనా బరిలోకి దిగుతున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి.

The Australian Open starts tomorrow
రేపే ఆస్ట్రేలియన్​ ఓపెన్​.. ఫేవరెట్​గా జకోవిచ్​

By

Published : Feb 7, 2021, 6:44 AM IST

Updated : Feb 7, 2021, 7:32 AM IST

ఓ వైపు కరోనా భయాలు.. మరోవైపు కఠిన క్వారంటైన్‌ గడిపిన ఆటగాళ్లు.. ఇంకోవైపు దిగ్గజాలను దాటి విజేతలుగా నిలవాలనే యువ ప్లేయర్ల ఆకాంక్షలు.. ఈ పరిస్థితుల నడుమ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 21న ఫైనల్‌ జరగనుంది. పద్నాలుగు రోజుల పాటు అభిమానులకు టెన్నిస్‌ మజాను అందించేందుకు దిగ్గజాలతో పాటు యువ ప్లేయర్లు సిద్ధమయ్యారు. కరోనా ఆంక్షల నడుమ మ్యాచ్‌లు వీక్షించేందుకు ప్రతి రోజు 30 వేల మందిని మైదానంలోకి అనుమతించనున్నారు. ఫెదరర్‌ ఈ టోర్నీలో ఆడట్లేదు.

సై అంటే సై..

పురుషుల సింగిల్స్‌లో పోరు రసవత్తరంగా సాగనుంది. దిగ్గజ ద్వయం జకోవిచ్‌, నాదల్‌తో పాటు థీమ్‌, మెద్వెదెవ్‌, సిట్సిపాస్‌, జ్వెరెవ్‌, రుబ్లెవ్‌, దిమిత్రోవ్‌ లాంటి యువ ఆటగాళ్లు టైటిల్‌ కోసం పోరాడేందుకు సిద్ధమయ్యారు. అయితే అందరి చూపు మాత్రం.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌, నాదల్‌పైనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటికే ఎనిమిది సార్లు ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు జకోవిచ్‌ విజేతగా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను.. వరుసగా మూడో ఏడాది టైటిల్‌ నెగ్గి హ్యాట్రిక్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.

18వ గ్రాండ్‌స్లామ్‌ విజయంపై కన్నేసిన అతనికి.. సెమీస్‌ చేరే క్రమంలో జ్వెరెవ్‌ నుంచి ముప్పు పొంచి ఉంది. సెమీస్‌లో యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ థీమ్‌ అడ్డుతగిలే వీలుంది. మరోవైపు ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో ఫెదరర్‌ సరసన చేరిన నాదల్‌.. ఈ టోర్నీలో గెలిస్తే పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. నిరుడు 13వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ కైవసం చేసుకున్న అతనికి.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాత్రం గొప్ప రికార్డు లేదు. అతను ఇప్పటివరకూ ఒక్కసారి (2009లో)ఇక్కడ గెలవగలిగాడు.

ఇప్పుడైనా..

మహిళల సింగిల్స్‌లో మార్గరేట్‌ (24) ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు గత మూడేళ్లుగా దండయాత్ర చేస్తూనే ఉన్న మాజీ నంబర్‌వన్‌ సెరెనా.. ఈ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనైనా ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతుందేమో చూడాలి. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్‌ విజయాలు సాధించిన ఆమె.. ఈ టోర్నీలో నెగ్గాలనే పట్టుదలతో ఉంది. అయితే ప్రపంచ నంబర్‌వన్‌ ఆష్లీ బార్టీ, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కెనిన్‌, ఒసాక, బియాంక, హలెప్‌, క్విటోవా లాంటి క్రీడాకారిణులను దాటి ఆమె ముందంజ వేయడం కఠిన సవాలే.

ఆమె డ్రా కూడా అంత సులభంగా లేదు. కరోనా విరామం తర్వాత బార్టీ ఆడనున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ ఇదే. నిరుడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి చరిత్ర సృష్టించిన పోలాండ్‌ టీనేజర్‌ స్వైటక్‌పైనా మంచి అంచనాలున్నాయి. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే రొమేనియా భామ హలెప్‌ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మనవాళ్లు..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారత క్రీడాకారులు సిద్ధమయ్యారు. పురుషుల సింగిల్స్‌లో వైల్డ్‌కార్డు ప్రవేశం పొందిన సుమిత్‌ నగాల్‌ సత్తాచాటాలనే ధ్యేయంతో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌ జోడీలు ఎంత వరకు వెళ్లగలుగుతాయో చూడాలి.

ఇదీ చదవండి:షమి ప్రాక్టీస్​ షురూ.. ఇంగ్లాండ్​తో టెస్టుకు అవకాశం!​

Last Updated : Feb 7, 2021, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details