పాకిస్థాన్‌తో డేవిస్ కప్ పోరుకు తనే కెప్టెన్‌గా వ్యవహరిస్తానని స్పష్టం చేశాడు సీనియర్ టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి. బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశాడు. సారథిగా తనను తప్పించినట్లు ఇప్పటికీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పాడు.
ఇటీవల మహేశ్ భూపతి స్థానంలో రోహిత్ రాజ్‌పాల్‌ను నాన్-ప్లేయింగ్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం పెద్ద చర్చనీయాంశమైంది.
" సోమవారం ఏఐటీఏ సెక్రటరీ జనరల్ ఛటర్జీ నాకు ఫోన్ చేశారు. నా బదులుగా రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించాలనుకుంటున్నట్లు చెప్పారు. గతంలో పాక్ వేదికగా డెవిస్ కప్‌లో ఆడేందుకు నేను నిరాసక్తత వ్యక్తం చేయడమే కారణంగా ఆయన తెలిపారు. అయితే తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికీ ఆటగాళ్లెవ్వరకీ సమాచారం లేదు. దాయాది దేశంలో కాకుండా ఎక్కడైనా ఆడేందుకు నేను సిద్ధమే. వేదిక మార్చితే డేవిస్ కప్‌కు అందుబాటులో ఉండి కెప్టెన్‌గా వ్యవహరిస్తాను".
-- మహేశ్ భూపతి, టెన్నిస్ ప్లేయర్
భూపతి బదులుగా రోహిత్ ఎంపికను ప్రశ్నిస్తూ... డేవిస్ కప్ బృందంలోని మరో సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ)పై మండిపడ్డాడు. ఆటగాళ్లను సంప్రదించకుండా కెప్టెన్‌ను ఎలా మారుస్తారని ఏఐటీఏను ప్రశ్నించాడు.
వేదిక మార్చినట్లేనా...!
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన డేవిస్ కప్ మ్యాచ్‌లను... తటస్థ వేదికపై నిర్వహించడానికి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ఏఐటీఏ ఇటీవల వెల్లడించింది. అయితే ఐటీఎఫ్ ఇలా స్పందించడానికి ముందు ఒక దశలో భారత జట్టును పాక్‌కు పంపేందుకు ఏఐటీఏ సిద్ధమైంది. కానీ అందుకు కొందరు ఆటగాళ్లతో పాటు నాన్-ప్లేయింగ్ కెప్టెన్ భూపతి అంగీకరించకపోవడం వల్ల అతడి స్థానంలో వేరొకరిని నియమించాలన్న నిర్ణయానికి ఏఐటీఏ వచ్చినట్లు వార్తలొచ్చాయి.
తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించడానికి ఐటీఎఫ్ సుముఖంగా కనిపించాక కెప్టెన్‌ను మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.