తెలంగాణ

telangana

ETV Bharat / sports

వింబుల్డన్​​​: పురుషుల ఫైనల్లో ఫెదరర్​ X జకోవిచ్​

ఎర్రమట్టి (ఫ్రెంచ్‌ ఓపెన్‌)లో తనను ఓడించిన రఫెల్‌ నాదల్‌పై రోజర్‌ ఫెదరర్‌ పచ్చగడ్డి (వింబుల్డన్‌)పై ప్రతీకారం తీర్చుకున్నాడు. సెమీస్​లో రఫాపై గెలుపొందిన ఈ దిగ్గజ ఆటగాడు వింబుల్డన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరో సెమీస్‌లో సెర్బియా స్టార్‌ జకోవిచ్‌.. బటిస్టా అగట్‌పై గెలిచి తుది సమరానికి అర్హత సాధించాడు. ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో రోజర్‌.. జకోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

వింబుల్డన్​​​: పురుషుల ఫైనల్లో జకోవిచ్​ X ఫెదరర్​

By

Published : Jul 13, 2019, 6:17 AM IST

Updated : Jul 13, 2019, 7:21 AM IST

వింబుల్డన్​ ఫైనల్లో అడుగుపెట్టిన ఫెదరర్​, జకోవిచ్​

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్​లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ మరోసారి ఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి రఫెల్​ నాదల్(స్పెయిన్​)​పై 7-6 (7-3), 1-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. ఆదివారం జరగబోయే టైటిల్​ పోరులో డిఫెండింగ్​ ఛాంపియన్ నొవాక్​ జకోవిచ్​తో తలపడనున్నాడు.

ఇప్పటివరకు ఫెదరర్​ కెరీర్​లో 20 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించాడు. వింబుల్డన్​(8), ఆస్ట్రేలియన్​ ఓపెన్​(6), యూఎస్​ ఓపెన్​(5), ఫ్రెంచ్​ ఓపెన్​(1) గ్రాండ్​స్లామ్​లు గెలుపొందాడు. జకోతో ఆదివారం ఫైనల్లో గెలిస్తే.. తొమ్మిదో వింబుల్డన్​తో పాటు 21వ గ్రాండ్​స్లామ్​ ట్రోఫీ సొంతం చేసుకోనున్నాడు.

మ్యాచ్​ సాగిందిలా...

ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు మాత్రమే రోజర్‌కు పోటీ ఇవ్వగలిగిన నాదల్‌.. పరాజయం పాలయ్యాడు. తొలి సెట్‌ ఎనిమిదో గేమ్‌లో ఫెదరర్‌ సర్వీసును బ్రేక్‌ చేసే అవకాశాన్ని సంపాదించాడు రఫా. అయితే అద్భుతంగా పోరాడిన రోజర్‌ 21 షాట్ల ర్యాలీతో బ్రేక్‌ పాయింట్‌ను కాచుకుని 4-4తో స్కోరు సమం చేశాడు. ఇద్దరు హోరాహోరీగా ఆడినందున సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో తన శైలి ఒంటిచేతి బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో మెరిపించిన రోజర్‌.. సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్లో నాదల్‌ విజృంభించాడు. రెండుసార్లు రోజర్‌ సర్వీసును బ్రేక్‌ చేసిన రఫా.. 6-1తో సెట్‌ గెలిచాడు. కానీ మూడో సెట్లో ఫెదరర్‌ పుంజుకున్నాడు. మూడో సెట్‌ నాలుగో గేమ్‌లో నాదల్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఫెదరర్‌ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరు కొనసాగిస్తూ అతను 6-3తో సెట్‌ గెలుచుకున్నాడు. నాలుగో సెట్లోనూ హవా కొనసాగించిన ఫెదరర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

జకోవిచ్​ వచ్చేశాడు

మరో సెమీఫైనల్లో ప్రపంచ నం.1 జకోవిచ్‌ విజయం సాధించాడు. స్పెయిన్​ ఆటగాడు బటిస్టా అగట్‌ను 6-2, 4-6, 6-3, 6-2తో ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లాడు ఈ టాప్‌సీడ్‌.

జకోవిచ్​ ఆస్ట్రేలియన్​ ఓపెన్​(7), యూఎస్​ ఓపెన్​(3), వింబుల్డన్​(4), ఫ్రెంచ్​ ఓపెన్​(1)తో మొత్తం 15 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించాడు.

Last Updated : Jul 13, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details