అమెరికన్ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు షాక్. యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో కెనెడియన్ సంచలనం బియాంక ఆండ్రిస్కూ చేతిలో ఘోర పరాజయం పాలైంది సెరెనా. 6-3, 7-5 వరుస సెట్లల్లో విజయం అందుకున్న 19 ఏళ్ల ఆండిస్కూ.. మ్యాచ్ ఆరంభం నుంచే సెరెనాపై పట్టు సాధించింది.
సెరెనాకు షాక్- యూఎస్ ఓపెన్ గెలిచిన ఆండ్రిస్కూ
టెన్నిస్ యువ కెరటం ఆండ్రిస్కూ సంచలనం సృష్టించింది. దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియన్స్‌ను ఓడించి యూఎస్ ఓపెన్‌ను కైవసం చేసుకుందీ 19 ఏళ్ల యువ సంచలనం. ఫైనల్స్‌లో 6-3, 7-5తో విజయాన్ని అందుకుని తొలి టైటిల్‌ను ముద్దాడింది ఆండ్రిస్కూ.
ఫైనల్స్‌లో విజయంతో టెన్నిస్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ రికార్డు(24 టైటిళ్లు)ను సమం చేద్దామనుకున్న సెరెనా కల నెరవేరలేదు. 24వ గ్రాండ్‌స్లామ్ గెలుపుపై ధీమాతో బరిలోకి దిగిన సెరెనాను కళ్లుచెదిరే ఆటతో కట్టిపడేసింది ఆండ్రిస్కూ. గతంలో ఎన్నడూ గ్రాండ్‌స్లామ్ రెండో రౌండ్ కూడా దాటని ఆండ్రిస్కూ... దిగ్గజ క్రీడాకారిణిని ఓడించి తొలి టైటిల్‌ను ముద్దాడింది. గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి కెనేడియన్ మహిళగా ఆండ్రిస్కూ రికార్డు సృష్టించింది. సెరెనా తన తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ (1999) గెలిచినప్పుడు ఆండ్రిస్కూ పుట్టనేలేదు.