టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలేకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొన్న ఓ పోలీస్ అధికారికి కరోనా సోకింది. ఈ రిలేలో నమోదైన తొలి వైరస్ కేసు ఇదే. ఈ విషయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు.
ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి ముందు జ్యోతిని తరలించడం(టార్చ్ రిలే) సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. దాదాపు 10 వేలమంది రన్నర్లతో జపాన్‌లోని 47 ముఖ్యమైన ప్రాంతాల మీదుగా వెళ్తూ.. ఒలింపిక్స్ జరగనున్న ప్రాంతానికి జులై 23న చేరుకుంటారు. ఇప్పటికే మార్చి 25న ఈశాన్య ఫుకుషిమా ప్రిఫెక్చర్ వద్ద ప్రారంభమై అక్కడి నుంచి బయలుదేరింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న నైరుతి కగావా ప్రిఫెక్టర్ వద్ద ఉండగా అక్కడి ట్రాఫిక్ కంట్రోల్ చేసే విధుల్లో ఓ 30ఏళ్ల పోలీస్ అధికారి పాల్గొన్నాడు. ఆ తర్వాత రోజు నుంచే అతడిలో కొవిడ్ లక్షణాలు కనపడ్డాయి. పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. ఆ అధికారి మాస్క్ ధరించడం, సామాజిక దూరం వంటి జాగ్రత్త చర్యలు పాటించినప్పటికీ కరోనా సోకిందని అధికారులు తెలిపారు.