తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: కష్టాలను ఎదురీది.. ఒలింపిక్స్ గమ్యాన్ని చేరి!

గతానికి భిన్నంగా టోక్యో ఒలింపిక్స్​కు ముగ్గురు భారత స్విమ్మర్లు అర్హత సాధించారు. ఈ కేటగిరీలో 1932 నుంచి 2016 రియో ఒలింపిక్స్​ వరకు దేశం తరఫున కేవలం 25 మంది మాత్రమే ఈ విశ్వ క్రీడల్లో పాల్గొన్నడం గమనార్హం. కొవిడ్ నేపథ్యంలో చాలా ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ.. అన్నింటినీ అధిగమించి ఈ మెగా ఈవెంట్​లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వారెవరు? వారి నేపథ్యమేంటో చూద్దాం.

sajan prakash, maana patel
సాజన్ ప్రకాశ్, మానా పటేల్

By

Published : Jul 3, 2021, 7:04 AM IST

ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌లో భారత ప్రాతినిథ్యం గురించి గొప్పగా చెప్పేందుకు ఏమీ కనిపించదు. 1932 ఒలింపిక్స్‌ మొదలు.. గత 2016 రియో వరకూ చూసుకుంటే మన దేశం నుంచి కేవలం 25 మంది స్విమ్మర్లు మాత్రమే ఈ విశ్వక్రీడల్లో పాల్గొన్నారు. నిజానికి ఒలింపిక్స్‌ వస్తోందంటే స్విమ్మింగ్‌లో ఎవరైనా అర్హత సాధిస్తారా? అని చూసే పరిస్థితి లేకపోయేది! అలాంటిది ఈ సారి ముగ్గురు స్విమ్మర్లు టోక్యో ఒలింపిక్స్‌ బెర్తులు దక్కించుకోవడం విశేషం. కరోనా కారణంగా చాలా కాలం పాటు ఈత కొలనులు మూసేసినప్పటికీ.. ఆటపై ఇష్టంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన ముగ్గురు స్విమ్మర్లు ఒలింపిక్స్‌ బరిలో నిలిచారు. వాళ్లే.. సాజన్‌ ప్రకాశ్‌, శ్రీహరి నటరాజన్‌, మానా పటేల్‌. సాజన్‌, శ్రీహరి 'ఎ' ప్రమాణాలతో విశ్వ క్రీడల్లో స్థానం సంపాదించడం గమనార్హం.

గాయాన్ని దాటి.. చరిత్ర సృష్టించి

సాజన్ ప్రకాశ్

రికార్డులను వెనక్కినెట్టి.. ఈతలో ముందుకు దూసుకెళ్లడం అలవాటు చేసుకున్న సాజన్‌ ప్రకాశ్‌.. సరికొత్త చరిత్ర సృష్టించి టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు పట్టేశాడు. రోమ్‌లో జరిగిన 200మీ. బటర్‌ఫ్లై విభాగంలో ఒక్క నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించి జాతీయ రికార్డు నెలకొల్పిన అతను.. అంతర్జాతీయ స్విమ్మింగ్‌ సమాఖ్య (ఫినా) 'ఎ' ప్రమాణాన్ని అందుకున్న తొలి భారత స్విమ్మర్‌గా ఘనత సాధించాడు. దీంతో అదే విభాగంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. కేరళకు చెందిన ఈ 27 ఏళ్ల పోలీస్‌ అధికారి 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఇదే విభాగంలో పోటీపడ్డాడు. ఇప్పటికే ఫ్రీస్టైల్‌, బటర్‌ఫ్లై, మెడ్లీ లాంటి విభాగాల్లో కలిపి మొత్తం 11 జాతీయ రికార్డులు తన ఖాతాలో వేసుకున్న అతని కెరీర్‌ ఒకనొక దశలో మెడ గాయం కారణంగా ప్రమాదంలో పడింది. కానీ పట్టుదలతో శ్రమించిన అతను దాని నుంచి బయటపడ్డాడు. కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల దుబాయ్‌ వెళ్లి సాధన కొనసాగించాడు. తన కోచ్‌ ప్రదీప్‌ అతనికి అక్కడ ఆశ్రయమిచ్చి శిక్షణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. తన తల్లి అథ్లెట్‌ కావడం వల్ల ఐదేళ్ల వయసులోనే స్విమ్మింగ్‌ మొదలెట్టిన అతను.. ఈ ఒలింపిక్స్‌లో ఒత్తిడిని అధిగమించి మంచి ప్రదర్శన చేస్తానంటున్నాడు.

ఇదీ చదవండి:Corona Effect: భారత్​లో జరగాల్సిన కామన్వెల్త్ గేమ్స్ రద్దు

తండ్రి మరణాన్ని దిగమింగి..

శ్రీహరి నటరాజ్

చిన్నప్పటి నుంచి ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న తండ్రి మరణాన్ని దిగమింగిన 20 ఏళ్ల శ్రీహరి నటరాజ్​ టోక్యో ఒలింపిక్స్‌ తలుపు తట్టాడు. ఈ ఏడాది జనవరిలో అతని తండ్రి చనిపోయారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే కల ఓ వైపు.. నాన్న లేడనే వేదన మరోవైపు.. అంతటి దుఃఖంలోనూ తిరిగి ఈత కొలనులో అడుగుపెట్టిన అతను అనుకున్నది సాధించాడు. రోమ్‌లో జరిగిన 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ట్రయల్స్‌లో 53.77 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసి.. ఫినా 'ఎ' ప్రమాణాన్ని అందుకుని కల నిజం చేసుకున్నాడు. క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చిన అతను.. చిన్నప్పటి నుంచే ఈతలో రాణించడం మొదలెట్టాడు. తన అన్నను చూసి ఈత కొట్టడం నేర్చుకున్న శ్రీహరి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 2019 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం ఎనిమిది స్వర్ణాలతో సంచలనం సృష్టించాడు. ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరి చివరకు 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఆరో స్థానంలో, 100 మీటర్లలో ఏడో స్థానంలో నిలిచాడు. కరోనా కారణంగా సాధనకు అంతరాయం కలిగినా.. తండ్రి మరణం కలచి వేసినా.. వాటన్నింటినీ దాటి ఇప్పుడు ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరుకోవాలనే లక్ష్యాన్ని అందుకునే దిశగా సాగుతున్నాడు.

ఊబకాయాన్ని అధిగమించాలని..

మానా పటేల్

ఊబకాయం నుంచి బయటపడాలని ఏడేళ్ల వయసులో స్విమ్మింగ్‌ మొదలెట్టిన మానా పటేల్‌.. ఇప్పుడు అత్యున్నత క్రీడలైన ఒలింపిక్స్‌లో పోటీపడే స్థాయికి చేరింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ 21 ఏళ్ల అమ్మాయి.. ఒలింపియన్‌గా నిలిచిపోవాలనే కలను నిజం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ప్రయాణం మధ్యలో భుజం గాయమైనా.. లాక్‌డౌన్‌ రూపంలో అడ్డంకులు ఎదురైనా ఆమె ఆగలేదు. యూరోపియన్‌ టోర్నీల్లో మంచి ప్రదర్శన చేసింది. దీంతో యూనివర్సాలిటీ కోటా కింద తనను ఒలింపిక్స్‌కు ఎంపిక చేయాలని భారత స్విమ్మింగ్‌ సమాఖ్య చేసిన విజ్ఞప్తిని ఫినా అంగీకరించడం వల్ల ఇప్పుడు టోక్యో విమానం ఎక్కనుంది. 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో జాతీయ రికార్డును సొంతం చేసుకున్న ఆమె.. ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. మానా ఇప్పటివరకూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో కలిపి తన వయసు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా పతకాలు సాధించడం విశేషం.

ఇదీ చదవండి:OLYMPICS: ఒలింపిక్స్ పతకాలు.. రీసైక్లింగ్​ చేసిన ఆ వస్తువులతో

ABOUT THE AUTHOR

...view details