క్రీడలు, సినిమా ఇంకా తదితర ఏ కార్యక్రమమైనా వాయిదా పడేకొద్దీ నిర్వహణ వ్యయం పెరిగిపోతుంది. సరైన సమయానికి జరపకపోతే భారీ మొత్తంలో ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఇందుకు టోక్యో ఒలింపిక్స్ మినహాయింపు కాదు. ఈ ఏడాది నిర్వహించాల్సిన ఈ క్రీడలు.. కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో వాటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ వ్యయం ఎంత? వచ్చే ఏడాదైనా క్రీడల్ని నిర్వహిస్తారా? ఐఓసీ విధులు ఏంటి? లాంటి అంశాల సమాహారమే ఈ కథనం.
2.8 బిలియన్ డాలర్లు ఎక్కువ!
టోక్యో ఒలింపిక్స్ అధికారిక ఖర్చు 12.6 బిలియన్ డాలర్లు. కానీ వ్యయం అంతకు రెండింతలు ఉండొచ్చని గతేడాది ప్రభుత్వ ఆడిట్‌లో తేలింది. అయితే ఈసారి ఒలిపింక్స్ ఖర్చు సాధారణ వ్యయం కన్నా 2.8 బిలియన్ డాలర్లు పెరగడం ఖాయమని తెలుస్తోంది.
ఒలింపిక్స్ నిర్వహణకు ఎందుకింత వ్యయం?
1960 నుంచి ఒలింపిక్స్ బడ్జెట్ ప్రతి ఏడాది సగటున 172 శాతం పెరుగుతోంది. 2012లో ఈ మెగా క్రీడల నిర్వహణకు 7.3 బిలియన్ డాలర్ల వ్యయమవగా.. ప్రస్తుతం 25 బిలియన్ డాలర్లు ఖర్చయ్యేలా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఆధునిక హంగులతో పోటీలు జరపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిర్వహణ ఖర్చులు అనుకున్న దానికన్నా ఎక్కువ అయినప్పుడు ఐఓసీ ఆ మొత్తాన్ని భరించదు. దీంతో స్థానిక నిర్వాహకులు, ప్రభుత్వాలపై ఆ వ్యయం పడుతుంది.