టోక్యో ఒలింపిక్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరిపై వేటు పడే అవకాశాలున్నాయి. అతణ్ని శుక్రవారం ఆ పదవి నుంచి తప్పించనున్నారని సమాచారం. ఇటీవల మహిళల పట్ల అతను అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఆడవాళ్లు చాలా అతిగా మాట్లాడతారని, శత్రుత్వ భావం వాళ్లకు ఎక్కువగా ఉంటుందని ఓ సమావేశంలో మోరి చెప్పినట్లు తెలిసింది.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం వల్ల క్షమాపణ చెప్పిన అతను.. తన పదవికి రాజీనామా చేసేందుకు మాత్రం అంగీకరించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతణ్ని పదవి నుంచి తప్పించాలనే వాదనకు బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకునేందుకు నిర్వాహక కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.